Begin typing your search above and press return to search.

అచ్చంపేట విజయం ఎవరి ఖాతాలోకి..?

By:  Tupaki Desk   |   9 March 2016 7:04 AM GMT
అచ్చంపేట విజయం ఎవరి ఖాతాలోకి..?
X
అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల విజయాన్ని విశ్లేషించాల్సి ఉందా? లేదా? అన్నది ఒక ప్రశ్న. అయితే.. ఇదేమీ లెక్కలోకి తీసుకోవాల్సిన అంశమే కాదని చెప్పేసేవారు చాలామందే ఉంటారు. కానీ.. అసలు విషయం తెలిస్తే మాత్రం.. ఔరా అనుకోవాల్సిందే. ఒక నగర పంచాయితీ ఎన్నికల ఫలితం గురించి భారీగా చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు.. రాజకీయ వర్గాలు చెప్పే సమాధానం ఏమిటంటే.. పేరుకు నగర పంచాయితీనే అయినప్పటికీ.. వెల్లడైన ఫలితమే చర్చించుకునేలా చేస్తుందని చెప్పొచ్చు.

విపక్షాలు వేర్వేరుగా పోటీ చేస్తూ.. అధికారపక్షంతో పోటీ పడినప్పుడు.. మొత్తం స్థానాల్లో అధికారపక్షం కానీ విజయం సాధిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. విపక్షాలు మొత్తం తమ విబేధాల్ని మరిచిపోయి.. అంతా కలిసిపోయి.. ఉమ్మడిగా పోటీ చేయటం అంత చిన్న పరిణామం కాదు. అలా కలిసి ఎన్నికల బరిలోకి దిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోవటం గమనార్హం.

మరింత భారీ విజయం ఎవరి ఖాతాలో వేయాలన్న విషయంలోకి వెళితే.. మూడు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుగా చెబుతున్నారు. స్థానికంగా జరుగుతున్న ఈ ఎన్నికల్ని తన వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకోవటంతో పాటు.. తన పరపతి మొత్తాన్ని ఈ ఎన్నికల కోసం వినియోగించినట్లు చెబుతున్నారు. ఇక.. మంత్రులు జూపల్లి కృష్ణారావు.. లక్ష్మారెడ్డిలు నగర పంచాయితీలో పది రోజులకు పైనే ఒక్కొక్కరుగా మకాం వేయటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదన్నట్లుగా వ్యవహరించటంతోనే.. క్లీన్ స్వీప్ సాధ్యమైందని చెప్పొచ్చు. మొత్తంగా అచ్చంపేట క్లీన్ స్వీప్ ఈ ముగ్గురికే చెందుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.