Begin typing your search above and press return to search.

లగడపాటి మోసం, కుట్ర పై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   19 Dec 2018 5:57 AM GMT
లగడపాటి మోసం, కుట్ర పై ఫిర్యాదు
X
లగడపాటి జోస్యం తప్పింది. ఇన్నాళ్లు ఆయన పెంచుకున్న విశ్వసనీయత తెలంగాణ ఎన్నికల ఫలితం తో కనుమరుగైంది. లగడపాటిని నమ్మి బెట్టింగ్ కాసిన బెట్టింగ్ రాయుళ్లు ఇళ్లు, ఆస్తులు అమ్ముకున్నారు. సర్వేలకే బ్రాండ్ అంబాసిడర్ అయిన లగడపాటి ఏ ముహూర్తానా.. ఎవరి ప్రలోభంతో తెలంగాణ పై తప్పుడు సర్వే చెప్పారో కానీ.. ఇప్పుడు ఆయన కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. రాబోయే ఏపీ ఎన్నికల్లో ఆయన సర్వే ఇదీ అని గొంతుచించుకున్నా ఎవ్వరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితి చేజేతులారా కొని తెచ్చుకున్న లగడపాటి ఇప్పుడు మీడియాకు కనపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు..

జనాన్ని తప్పుదోవ పట్టించి.. ఫలితాలను తారుమారు చేద్దామని ప్రయత్నించిన లగడపాటిని టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వదలడం లేదు. తాజాగా లగడపాటి పై ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.. టీఆర్ఎస్ ను ఓడించాలని కుట్రపన్నిన లగడపాటి పై ప్రతీకారానికి స్కెచ్ గీశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిసిన ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నేత వెంకటరమణారెడ్డి.. లగడపాటి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ఎలాంటి సర్వే ఫలితాలు వెల్లడించవద్దన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు లగడపాటి ఉల్లంఘించారని.. ఎనిమిది నుంచి పదిమంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని విన్నవించారు. ఇలా చేయడం ద్వారా ఓటర్లను లగడపాటి తప్పుదారి పట్టించారని.. బ్లాక్ మెయిల్ , మోసం వంటి చర్యలకు లగడపాటి దిగారని ఫిర్యాదులో వివరించారు.

లగడపాటి సర్వే కూడా నిజం కాలేదని.. లగడపాటి చెప్పిన ఇంటిపెండెంట్లు బెల్లంపల్లిలో జి.వినోద్, ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ లో జలంధర్ రెడ్డిలు గెలవలేదని.. కాబట్టి ఇలా తప్పుడు సర్వేలు చేసిన లగడపాటి పై కఠిన చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఇలా చేయకుండా గట్టి వార్నింగ్ ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు.