Begin typing your search above and press return to search.

బీజేపీ ఛార్జిషీట్ కు 50 క్వశ్చన్లతో కేటీఆర్ కౌంటర్

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:16 PM GMT
బీజేపీ ఛార్జిషీట్ కు 50 క్వశ్చన్లతో కేటీఆర్ కౌంటర్
X
దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీజేపీలో ఉత్సాహం మరింత పెరిగింది. అదే ఊపులో హైదరాబాద్ మహా పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది బీజేపీ. దుబ్బాకలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఏ చిన్న తప్పునకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అన్న రీతిలో బీజేపీని తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ.. వారి విషయంలో అమితమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.

అయితే.. ఓపెన్ గా మాత్రం తమ ప్రత్యర్థి మజ్లిస్ అంటూ చెబుతున్నప్పటికీ.. టీఆర్ఎస్ నేతల మాటలు.. వారి టార్గెట్ చూస్తే.. కమలనాథులే లక్ష్యమన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. రెండురోజుల క్రితం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చి.. టీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పుల మీద ఛార్జిషీట్ అంటూ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తప్పుల్ని ఉతికి ఆరేశారు. తమపై ఎత్తి చూపిన తప్పులకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్.

తాజాగా బీజేపీ విడుదల చేసిన ఛార్జిషీట్ కు కౌంటర్ అన్నట్లు.. 50 ప్రశ్నల్ని సంధించింది. ఇందులో జాతీయ అంశాలు మొదలుకొని.. హైదరాబాద్ నగర అంశాల వరకు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. భారత దేశాన్నిబీజేపీఅమ్మేస్తుందని విమరశించారు. దేశంలో ముస్లింలపై బీజేపీకి ఎంత విద్వేషం ఉందో అందరికి అర్థమవుతుందంటూ.. విషయాన్ని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసింది.

పేకాట క్లబ్ లు మూయించివేసినందుకు మాపై ఛార్జిషీట్? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు బీజేపీపై ఛార్జిషీట్ వేయాలి. కరోనా వేళ చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్ వేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీ రైతులు ఛార్జిషీట్ వేయాలని.. పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్తు కోసమా? గుజరాత్ పెద్దల కోసమా? అంటూ.. ప్రశ్నల వర్షం కురిపించింది.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి తరచూ వస్తున్న ప్రశ్నలను కూడా తాజాగా విడుదల చేసిన యాభై ప్రశ్నల్లో కలపటం గమనార్హం. వేల కోట్ల రూపాయిల్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థల్ని అర్థణాకి.. పావుసేరుకు తెగనమ్ముతున్నరాంటూ.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ అయిన ఇండియన్ రైల్వేను ప్రైవేటు పరం చేస్తోంది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఈసారి తాము తొలిస్థానంలో ఉంటామని.. మజ్లిస్ రెండో స్థానంలో నిలుస్తుందని కేటీఆర్ వెల్లడించారు. అంతాబాగుంది కానీ.. బీజేపీ చేస్తున్నతప్పులు.. మోడీ సర్కారు వైఫల్యాలు.. గ్రేటర్ ఎన్నికల వేళలోనే ఎందుకు గుర్తుకు వచ్చినట్లు? విడిరోజుల్లో ఏమైనట్లు కేటీఆర్? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ అధినాయకత్వం సమాధానం చెబితే బాగుంటుందేమో?