Begin typing your search above and press return to search.

మేం బాగున్నాం... మీరు బాగుంటారు : సెటిలర్లు

By:  Tupaki Desk   |   4 Jan 2019 9:54 AM GMT
మేం బాగున్నాం... మీరు బాగుంటారు : సెటిలర్లు
X
"చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టారు. మేం ఆంధ్రప్రదేశ్‌ లో వేలు పెడతాం"
- తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు కె. తారక రామారావు
"చంద్రబాబుకు సంబంధం లేని తెలంగాణలో ప్రచారం చేసారు. ఆయనకు మేం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా"
- తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
"ఆంధ్రప్రదేశ్‌ లో మేం ప్రచారం చేస్తాం. అది ఎలా చేస్తాం, ఎవరికి చేస్తాం తర్వాత తెలుస్తుంది."
-తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు ఫలితాల అనంతరం తెలంగాణ రాష‌్ట్ర సమితి నాయకులు చేసిన వ్యాఖ్యలు ఇవి. మరో నాలుగైదు నెలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయా వేడి తారాస్దాయికి చేరింది. వచ్చే ఎన్నికలలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిని నిజం చేస్తు ఆంధ్రప్రదేశ్‌ లోను, తెలంగాణలోను కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎలా ప్రచారం చేయాలి, ఎవరెవరు ప్రచారానికి వెళ్లాలి వంటి అంశాల పై తెలంగాణ రాష్ట్ర సమితిలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలివిడతగా తెలంగాణలో సెటిలైన ఆంధ్రులను ప్రచారానికి పంపాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించినట్టు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెరాస విజయంలో సెటిలర్లు కీలక పాత్ర పోషించారు. వివిధ కాలనీలలో, అపార్ట్‌ మెంటులలో, కమ్యూనిటి హళ్లలో సెటిలర్లు సమావేశమై తెరాసాను గెలిపించాలని తీర్మానించారు. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌ పల్లిలో కూడా తెరాస విజయం సాధించింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన మహాకూటమి అభ్యర్ది ఆషామాషీ కాదు. అయిన తెరాస గెలిచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో తామెంత ఆనందంగా ఉన్నామో.. తెరాసా మద్దతు ఇచ్చిన పార్టీని గెలిపిస్తే మీరు అంతే ఆనందంగా ఉంటారన్న నినాదంతో సెటిలర్ల చేత ప్రచారం చేయించాలని తెరాస నిర్ణయించినట్టు చెబుతున్నారు.

సెటిలర్లలో ఏ జిల్లాకు చెందిన వారిని, ఆ జిల్లాలకు పంపించి వారి బంధువులు స్నేహితులు, కులసంఘాల వారితో సమవేశాలు ఏర్పాటు చేయించాలని తెరాస ఉద్దేశంగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో వ్యూహాత్మకంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడిని కోలుకోలేని దెబ్బ తీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహ ప్రతి వ్యూహాలు రచించే పనిలో పడిందంటున్నారు.