Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా పోగొట్టుకున్నా..జడ్పీలో తిరిగి సాధించారు

By:  Tupaki Desk   |   9 Jun 2019 6:25 AM GMT
ఎమ్మెల్యేగా పోగొట్టుకున్నా..జడ్పీలో తిరిగి సాధించారు
X
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌న్న సామెత‌ను అక్ష‌ర స‌త్యం చేశారు కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు. రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. గెలుపుకు పొంగిపోవ‌టం.. ఓట‌మికి కుంగిపోవటం లాంటివి అన‌వ‌స‌రం. ఒక‌ప్పుడు ఎలాంటి ప్రాధాన్య‌త లేనోళ్లు.. కాల మ‌హిమ‌తో కొన్నిసార్లు చెలరేగిపోతుంటారు. రాజ‌కీయాల్లో క‌నిపించే ఈ ధోర‌ణి ఎంత నిజ‌మ‌న్న విష‌యం తాజాగా తెలంగాణ జ‌రిగిన జడ్పీ ఛైర్మ‌న్ల ఎంపికను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

గ‌తంలో ఎమ్మెల్యేలుగా ప‌ని చేసిన న‌లుగురు నేత‌లు.. ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎన్నిక‌ల్లో ఓడిన వారికి తాజాగా జడ్పీ ఛైర్మ‌న్ పేరుతో మ‌రో అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన ఈ ఉదంతంలో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన న‌లుగురు మాజీ ఎమ్మెల్యేల‌కు జడ్పీ ఛైర్మ‌న్ పోస్టులు ల‌భించాయి.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జడ్పీ చైర్ ప‌ర్స‌న్ గా సాల్గుటి స్వ‌ర్ణ సుధాక‌ర్ రెడ్డి నియ‌మితుల‌య్యారు. గ‌తంలో ఆయ‌న అమ‌ర‌చింత ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు.

ఆసిఫాబాద్ జడ్పీ చైర్ ప‌ర్స‌న్ గా ఎంపికైన కోవా ల‌క్ష్మీ.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. తాజా విజ‌యం ఆమెకు ఊర‌ట‌ను ఇచ్చింద‌ని చెప్పాలి. పెద్ద‌ప‌ల్లి జడ్పీ చైర్మ‌న్ పుట్ట మ‌ధుక‌ర్ మంథ‌ని ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. తాజాగా గెలుపుతో ఆయ‌న ఏకంగా జ‌డ్పీ చైర్మ‌న్ గిరిని సొంతం చేసుకున్నారు.

అదే తీరులో కొత్త‌గూడెం జ‌డ్పీ చైర్మ‌న్ కోరం క‌న‌క‌య్య కూడా గ‌తంలో ఇల్లందు ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడినా.. ఆర్నెల్లు తిరిగేస‌రికి.. జ‌డ్పీ చైర్మ‌న్ గా ఎన్నిక‌య్యే అదృష్టాన్ని ఆయ‌న సొంతం చేసుకున్నార‌ని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడి.. ఆర్నెల్లు తిరిగేస‌రికి మ‌ళ్లీ ప‌దవిని.. ప‌వ‌ర్ ను సొంతం చేసుకున్న ఈ న‌లుగురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నార‌ని చెప్పాలి.