Begin typing your search above and press return to search.

దేశంలోనే విరాళాల సేకరణలో టీఆర్ఎస్ ఫస్ట్.. టీడీపీ సెకండ్ !

By:  Tupaki Desk   |   12 Nov 2021 6:30 AM GMT
దేశంలోనే విరాళాల సేకరణలో టీఆర్ఎస్ ఫస్ట్.. టీడీపీ సెకండ్ !
X
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ ఆర్ సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది.

దేశవ్యాప్తంగా 2019-20లో మొత్తం 25 ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ.803.24 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది. మరోవైపు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి రూ.445.77 కోట్ల విరాళాలు సమకూరినట్లు ఏడీఆర్ వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తం గా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాలలో 95 శాతం ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయని తెలిపింది. రూ.20వేల కంటే తక్కువ విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు.

ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) కంట్రిబ్యూషన్‌, ఆడిట్‌ నివేదిక పేర్కొంది. ఏడీఆర్‌ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తం గా గుర్తింపు పొందిన 53 పార్టీల ఆదాయాలను విశ్లేషించింది. 2019-20 సంవత్సరంలో 25 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.803.24 కోట్ల ఆదాయం రాగా, ఇందులో రూ.445.77 కోట్లు తెలియని మార్గాల నుంచి వచ్చాయని ఆయా పార్టీలు చూపించాయి. తెలియని మార్గాల నుంచి విరాళాల్లో టీఆర్ ఎస్ కు దేశంలోనే అత్యధికంగా రూ.89.158 కోట్లు రాగా, టీడీపీ రూ.81.694 కోట్లు, వైసీపీ రూ.74.75 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో బిజూ జనతాదళ్‌ రూ.50.58 కోట్లు, తమిళనాడులోకి డీఎంకేకి రూ.45.5 కోట్లు, మహరాష్ట్రలోని శివసేనకి రూ.42.79కోట్లు, కర్ణాటకలోని జేడీఎస్‌ కి రూ.18.55 కోట్లు, జేడీయూ రూ.13.04కోట్లు, సమాజ్ వాది పార్టీకి రూ.10.84 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.