Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఆవిర్భావం: కేసీఆర్ కల పుట్టి 20 ఏళ్లు

By:  Tupaki Desk   |   27 April 2021 6:30 AM GMT
టీఆర్ఎస్ ఆవిర్భావం: కేసీఆర్ కల పుట్టి 20 ఏళ్లు
X
నాడు ఒక్కడై కదిలాడు.. నేను రాష్ట్ర సారథియే నడిపిస్తున్నాడు. ఎన్నో అవమానాలు.. ఉద్యమాలు.. జైలు, ఆమరణ దీక్షతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల నెరవేరింది. 20 ఏళ్ల కిందట ఇదే రోజును పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కల సాకారం చేసి ప్రజల ఆశ తీర్చింది. ఆ పార్టీ 20 ఏళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్

తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి 20 ఏళ్లు అవుతోంది. 14 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడి కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు 20 ఏళ్ల పండుగ కరోనాతో కల తప్పింది. అయినా కూడా పార్టీ ఆవిర్భావాన్ని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.

20 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాను ముందు పెట్టుకొని హైదరాబాద్ లోని జలదృశ్యంలో ఇదే రోజున సీఎం కేసీఆర్ పార్టీ ప్రకటన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను సిద్ధాంతకర్తగా పెట్టుకొని పోరాటం చేశారు. ఆ రోజున కేసీఆర్ వెంట ఎవరూ లేరు. ఎన్నో ఎదురుదెబ్బలను కేసీఆర్ ఈ 20 ఏళ్లలో తిన్నారు.

టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన పరిషత్ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో సొంతంగా జడ్పీ చైర్మన్ లను కూడా సొంతం చేసుకుంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. 5 ఎంపీ సీట్లను గెలుచుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేరింది.

అయితే కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వకపోవడంతో పదవులను త్యాగం చేసి మళ్లీ ఉద్యమ బాటపట్టారు. అయితే నాటి సీఎం వైఎస్ఆర్ టీఆర్ఎస్ ను చీల్చి దెబ్బతీశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో చేరి టీఆర్ఎస్ దెబ్బతింది. మరోసారి ఓడిపోయింది. టీఆర్ఎస్ పని అయిపోయిందనుకుంటున్న సమయంలో వైఎస్ మరణంతో మరోసారి ఉద్యమ ఎగిసింది.

వైఎస్ మరణంతో కేసీఆర్ ఉద్యమ వ్యూహాలకు పదును పెట్టారు. 2009 నవంబర్ 29న ఆమరణ దీక్ష చేపట్టారు. అది తెలంగాణను కదిలించింది. ఉద్యోగ, విద్యార్థి, అన్ని సంఘాలను ఏకంగా చేసి సకల జనుల సమ్మెకు దారితీసింది. దీంతో కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కట్టి అధికారం అప్పగించారు.

ఉద్యమ పార్టీగా మొదలైన ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర సాధననుంచి ఇప్పుడు రెండు వరుస సార్లు అధికారం సాధించేదాకా ఎదిగింది. ఈసారి కరోనాతో టీఆర్ఎస్ 20ఏళ్ల పార్టీ సంబురం చేసుకోకుండా అయ్యింది.