Begin typing your search above and press return to search.

న‌కిరేక‌ల్ టీఆర్ఎస్ లో తాజా, మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య భ‌గ్గుమ‌న్న‌ విభేదాలు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:40 PM GMT
న‌కిరేక‌ల్ టీఆర్ఎస్ లో తాజా, మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య భ‌గ్గుమ‌న్న‌ విభేదాలు!
X
తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం త‌ల ప‌ట్టుకుంటోంద‌ని అంటున్నారు. తాజాగా న‌ల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య విబేధాల‌తో టీఆర్‌ఎస్‌లో వివాదం ముదిరింద‌ని చెబుతున్నారు.

2018 ఎన్నిక‌ల్లో న‌కిరేక‌ల్ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున చిరుమ‌ర్తి లింగ‌య్య విజ‌యం సాధించారు. చిరుమ‌ర్తి లింగ‌య్య 2009లోనూ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. 2014లో మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయారు. కాగా 2018లో చిరుమ‌ర్తి లింగ‌య్య‌ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాక టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో టీఆర్ఎస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా ఉన్న వేముల వీరేశానికి, టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంద‌నే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది.

వేముల వీరేశం కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపిస్తున్నారు. భూములను క‌బ్జా చేసే చరిత్ర వీరేశందేన‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ప్ర‌శాంత్ కిశోర్ సర్వే ఆధారంగా ఈసారి తనకే ఎమ్మెల్యే టికెట్ అంటూ.. వేముల వీరేశం తన అనుచరులతో అసత్య‌ ప్రచారం చేయించుకుంటున్నాడని మండిప‌డుతున్నారు. రూ.20 వేలకు దొరికే డాక్టరేట్‌ పట్టాతో వీరేశం హడావిడి చేస్తున్నాడని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కిరాయి వ్యక్తులతో తనపై అసత్యప్రచారం చేస్తున్నాడని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అస‌లు వేముల వీరేశంకు టీఆర్‌ఎస్‌లో సభ్యత్వమే లేదంటున్నారు.

మ‌రోవైపు దీని ధీటుగా వేముల వీరేశం కూడా అంతేస్థాయిలో బ‌దులిస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి నియోజ‌క‌వ‌ర్గం ఆ పార్టీకి జెండా క‌ట్టింది తానేన‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టీఆర్ఎస్ త‌ర‌ఫున‌ న‌కిరేక‌ల్ టికెట్ వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. చిరుమ‌ర్తి లింగయ్య ఎక్క‌డి నుంచి వ‌చ్చారో అక్క‌డికి పోవ‌డం ఖాయ‌మ‌ని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో కింద స్థాయి నేత‌ల‌తోపాటు టీఆర్ఎస్ అధిష్టానం కూడా త‌ల‌ప‌ట్టుకుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.