Begin typing your search above and press return to search.

పారదర్శకత ఇప్పుడెక్కడికి వెళ్లింది కేసీఆర్

By:  Tupaki Desk   |   12 Feb 2016 5:30 PM GMT
పారదర్శకత ఇప్పుడెక్కడికి వెళ్లింది కేసీఆర్
X
నిర్ణయం ఏదైనా కానీ ఎలాంటి మొహమాటం లేకుండా తీసుకునే దమ్మూ.. ధైర్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. తనకు ఇబ్బంది కలిగిస్తుందన్న భావన కలిగితే ఎంతటి కఠిన నిర్ణయాన్ని అయినా తీసుకునే ఆయన.. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పత్రికా స్వేచ్ఛ గురించి పలు సందర్భాల్లో మాట్లాడటమే కాదు.. తమ ప్రభుత్వం ఎంతటి పారదర్శకంగా వ్యవహరిస్తుందో గొప్పలు చెప్పుకునే ఆయన.. తాజాగా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి పలు జీవోల్ని జారీ చేస్తుంది.

నిజానికి ఈ ప్రక్రియ కొత్తేం కాదు. ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచి వస్తున్నదే. అయితే.. అలా జారీ చేస్తున్న ప్రతి జీవోను ప్రభుత్వ వెబ్ సైట్ లో పెట్టటం.. వాటిపై అందరూ దృష్టి సారించటమే కాదు.. కోర్టుల్లో కేసులు వేసేస్తున్న పరిస్థితి. ఇక.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకునే వారికి.. విమర్శలు చేయటానికి ఈ జీవోలు అయుధాలుగా మారుతున్నాయి.

ఇలాంటి పరిస్థితిపై చిరాకు పుట్టిన కేసీఆర్.. భారీ నిర్ణయమే తీసుకున్నారు. తెలంగాణ సర్కారు జారీ చేసే జీవోల్ని వెబ్ సైట్ లో పెట్టాల్సిన అవసరం లేదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు. అంతే.. బుధవారం నుంచి సదరు వెబ్ సైట్ (www.goir.telangana.gov.in) పని చేయటం మానేసింది. ఈ మధ్యకాలంలో తెలంగాణ సర్కారు తీసుకున్న రెండు కేసులు (స్మితా సబర్వాల్ కు న్యాయ సాయం కోసం ప్రభుత్వం నిధులు జారీ చేసే జీవో.. ఎన్టీఆర్ స్టేడియంను కళాభారతిగా మార్చాలన్న జీవో) ఎదుర్కొంటోంది. ఈ రెండు కేసులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోల ఆధారంగా కోర్టులలో ఫైల్ కావటం గమనార్హం. ప్రత్యర్థుల చేతికి సమాచారం ఇచ్చి మరీ తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. అసలు జీవోలే బయటకు రాకపోతే పోలా అన్న ఆలోచనతోనే సైట్ ను మూసేసినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ సర్కారు వైట్ పేపర్ లా వ్యవహరిస్తుందని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడేమైందన్న ప్రశ్న వినిపిస్తోంది.