Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు భేష్

By:  Tupaki Desk   |   27 July 2015 9:26 AM GMT
కేసీఆర్ సర్కారు భేష్
X
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దేశానికి ఆదర్శప్రాయం అనదగ్గ నిర్ణయం ఒకటి తీసుకుంది. అదే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంస్కరణలు తీసుకు రావడం. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల నిర్వహణకు రోగులను బయటి డయోగ్నాస్టిక్ సెంటర్లకు పంపకుండా ఆస్పత్రిలోనే ప్రైవేటు వ్యక్తులతో చేయించాలని.. అందుకు డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. ఇది నిజంగా అభినందించదగ్గ పథకం. అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయం కూడా.

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది నిరుపేద రోగులే. మిగిలిన వారంతా ఇటీవల ఎలాగూ కార్పొరేట్ ఆస్పత్రుల గుమ్మం తొక్కుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే అక్కడ డాక్టర్లు ఉండరు. డాక్టర్లు ఉంటే వైద్య చికిత్సలకు పరికరాలు ఉండవు. మందులు ఇవ్వరు. ఉన్న డాక్టర్లు వైద్య పరీక్షలకు చీటీలు రాస్తారు. వాటిని ఫలానా డయోగ్నాస్టిక్ సెంటర్లో చేయించుకుని రావాలని ఆదేశిస్తారు. దాంతో ప్రైవేటు డయోగ్రాస్టిక్ వ్యక్తికి, డాక్టర్ కు పర్సంటేజీలు ఉంటాయి. అక్కడ రోగిని పీల్చి పిప్చి చేస్తారు. అతని మొత్తం డబ్బులన్నీ వైద్య పరీక్షలకే అయిపోతున్నాయి. దాంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన నిరుపేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చికిత్స పూర్తికాక రోగం నయంకాక బాధలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య పరీక్షలను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చి.. వాటిని ఆస్పత్రిలోనే చేయించి.. అందుకు డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడం నిజంగా మంచి విషయమే. పేదలకు నిజంగా మేలు చేసే విషయం కూడా.

అదే సమయంలో, ఆస్పత్రులు, డాక్టర్ల వ్యవహార శైలిలోనూ మార్పులు తీసుకొచ్చేలా కేసీఆర్ కంకణం కట్టుకుంటే.. ప్రభుత్వ ఆస్పత్రులను సమూలంగా ప్రక్షాళన చేస్తే దేశానికే అది ఆదర్శమవుతుంది. ప్రైవేటు దోపిడీకి ఆయన చెక్ చెప్పినట్లు అవుతుంది.