Begin typing your search above and press return to search.

అడకత్తెరలో టీ సర్కారు!

By:  Tupaki Desk   |   17 March 2015 1:20 PM GMT
అడకత్తెరలో టీ సర్కారు!
X
అంగన్‌వాడీ కార్యకర్తలు హైదరాబాద్‌లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అరెస్టులు చేశారు. లాఠీచార్జిలు కూడా చేశారు. అయినా, చంద్రబాబు ప్రభుత్వం దమన కాండ అనే విమర్శలు రావడం లేదు. ఎందుకూ..!? ఎందుకంటే, ఇక్కడ అంగన్‌వాడీలను అరెస్టులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదు. కేసీఆర్‌ ప్రభుత్వం. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు దానివే కనక.. వారిని అరెస్టు చేసింది కూడా విమర్శలు కూడా కేసీఆర్‌ ప్రభుత్వానికే.

గతంలో ఉద్యమాలు జరిగినప్పుడు.. అసెంబ్లీ ముట్టడులకు పిలుపు ఇచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా బద్నామ్‌ అయ్యేవి. మహిళలు, ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారనే అపకీర్తిని మూటగట్టుకునేవి. చంద్రబాబు అయితే కాల్పులు జరిపించారనే నిందనూ మోసారు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. ఇక్కడ శాంతి భద్రతలు కేసీఆర్‌ ప్రభుత్వానివి. ఇక్కడే చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ జరుపుకుంటోంది. అందువల్ల ఏపీఅసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కేసీఆర్‌ ప్రభుత్వానిది. అంగన్‌వాడీలను అడ్డుకుంటే చంద్రబాబుపై ఉద్యమం చేస్తుంటే కేసీఆర్‌ అడ్డుకున్నారనే మచ్చ పడుతుంది. ఒకవేళ చంద్రబాబుపై ఆందోళనతో తమకు సంబంధం లేదని ఊరుకుంటే శాంతి భద్రతలను నిర్వర్తించలేకపోయారనే అపకీర్తి మూటగట్టుకోవాలి. ఇప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా మారింది తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి. అంగన్‌వాడీల విషయంలోచంద్రబాబుకు ఇదే వరంలా మారింది.