Begin typing your search above and press return to search.

మిఠాయిలు తినిపించి...బాణసంచా కాల్చేది ?

By:  Tupaki Desk   |   11 July 2015 4:12 AM GMT
మిఠాయిలు తినిపించి...బాణసంచా కాల్చేది ?
X
సమస్యలు లేని వారు ఉండరు. తమ సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. మిగిలిన వారిని పక్కన పెడితే.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే తెలంగాణ సర్కారు కూడా తక్కువ తినలేదు.

తెలంగాణ వస్తే.. స్వర్గం పై నుంచి కిందకు దిగి వస్తుందని ఉద్యమ నేతగా కేసీఆర్‌ ఎన్నో ఆశలు చూపించారు. దీనికి తోడు తెలంగాణ రావటమే కాదు.. తమ చేతికి వస్తే చాలు.. అద్భుతాలు సృష్టిస్తామని.. ప్రతిఒక్కరి బతుకుల్లోనూ మార్పులు జరిగిపోతాయని రంగుల సినిమాను చూపించారు. సుదీర్ఘకాలంగా ఆయన చూపిస్తున్న సినిమా.. తెలంగాణ ప్రజల మనసుల్లో అచ్చు అయిపోయింది.

ఊహించని విధంగా తెలంగాణ కల సాకారం కావటమే కాదు.. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊహించని విధంగా స్పష్టమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారం లభించింది. ఒకనాటి ఉద్యమనేతగా తాను చెప్పిన మాటల్ని.. ఇచ్చిన హామీల్లో చాలావరకూ అమలు విషయం మీద కేసీఆర్‌ దృష్టి సారించింది లేదు. సమస్యల పరిష్కారం మీద కంటే కూడా.. రాజకీయం మీద ఎక్కువ ఫోకస్‌ పెంచటం.. తెలంగాణలో రాజకీయంగా తాము తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలన్న అంశంపైనే కేసీఆర్‌ ఎక్కువ దృష్టి పెట్టటం.. ఆయా వర్గాల్ని అసంతృప్తికి గురయ్యేలా చేసింది.

మరో విషయం ఏమిటంటే.. ఏదైనా సంఘాలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసినప్పుడు.. వినతిపత్రాలు ఇచ్చినప్పుడు పెద్దగా పట్టని సర్కారు.. అదే సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చినప్పుడు కూడా పెద్దగా స్పందించేది ఉండదు. సమ్మె సైరన్‌ మోగి.. మూడు రోజులు గడిచిన తర్వాత అన్ని పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయి.. ప్రజాగ్రహం మొదలైన తర్వాత తీరిగ్గా మేల్కనటం తెలంగాణ సర్కారుకు కొత్తేం కాదు.

ఇలాంటి తీరును చాటి చెప్పే పలు ఉదంతాలు ఉన్నాయి. అది ఉద్యోగుల పీఆర్సీ కోసం జరిగిన లల్లి కావొచ్చు.. ఆర్టీసీ సమ్మె కావొచ్చు.. మరొకటి కావొచ్చు. అన్నింటిలోనూ.. తమ డిమాండ్ల పరిష్కారానికి చర్చల కంటే కూడా ఆందోళనతోనే సాధన సాధ్యమని నమ్మేలా ప్రభుత్వ వైఖరి ఉండటం గమనార్హం. తాజాగా.. గ్రేటర్‌ కార్మికుల విషయంలోనూ ఇదే పరిస్థితి. గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది.

మరోవైపు ప్రభుత్వం సైతం.. కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉండటం.. నెమ్మదిగా వారి వ్యవహారం ప్రజా సమస్యగా మారింది. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని వీధులన్ని పారిశుద్ధ్యం కరువై.. కంపుకొడుతున్న పరిస్థితి. చెత్త భారీగా పేరుకుపోవటంతో.. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది.

ఎప్పటిమాదిరే.. సమస్య పెరిగి పెద్దదైన తర్వాత కళ్లు తెరిచి డ్యామేజ్‌కంట్రోల్‌ కోసం వారి కోరికలన్నీ తీర్చేందుకు సిద్ధంగా కావటం.. ఆర్భాటంగా ప్రకటనలు చేయటం.. అప్పటివరకూ ఆందోళన చేసిన వారు మిఠాయిలు పంచిపెడుతూ.. బాణసంచా కాల్చేసి తమ ఆనందాన్ని ప్రకటించేస్తారు. పారిశుధ్య కార్మికులకు సంబంధించిన సమ్మెలో అలాంటి సీన్‌ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు. మరి.. అలాంటి దృశ్యాన్ని తెలంగాణ సర్కారు ఎప్పుడు ఆవిష్కృతం చేస్తుందో చూడాలి.