Begin typing your search above and press return to search.

చుక్కలు చూపిస్తున్న మున్సిపల్ కార్మికులు

By:  Tupaki Desk   |   16 July 2015 3:02 PM GMT
చుక్కలు చూపిస్తున్న మున్సిపల్ కార్మికులు
X
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ కార్మికుల సమ్మె మరింత బిగుసుకుంటోంది.... విపక్షాలన్నీ వారికి మద్దతిస్తుండడంతో సమ్మె కాస్త బంద్ ల దిశగా సాగుతోంది. శుక్రవారం చేపడుతున్న తెలంగాణ బంద్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఆందోళన చేపట్టిన వామపక్షాలు... సర్కార్‌ వైఖరిని నిరసిస్తూ బంద్‌ చేయనున్నాయి. సమ్మెను పోలీసులతో అణచివేయాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే తగిన గుణపాఠం చెబుతామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఈ బంద్ కు తెలంగాణ టీడీపీ పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలను వారు అడగకుండానే ఆఘమేఘాల మీద పెంచిన కేసీఆర్ కార్మికుల విషయానికొచ్చేసరికి ఎందుకు ఇలా మొండిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం డిమాండ్ తో రేపు జరగనున్న బంద్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్ల పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా టీడీపీ సూటిగా కేసీఆర్ వేసిన ప్రశ్న ఇప్పుడు అన్ని రాజకీయవర్గాల్లో ఆలోచనకు దారితీసింది. ప్రజాప్రతినిధులెవరూ కోరకుండానే వారి జీతాలు భారీగా పెంచిన కేసీఆర్ కార్మికులకు రూపాయి కూడా పెంచకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంద్ కు కాంగ్రెస్ కూడా కలిసొచ్చే పరిస్థితులు కనపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న తొలి భారీ ఆందోళన ఇదే కానుంది.