Begin typing your search above and press return to search.

తలనొప్పిగా ఫిరాయింపుల వ్యవహారం

By:  Tupaki Desk   |   17 July 2015 4:20 AM GMT
తలనొప్పిగా ఫిరాయింపుల వ్యవహారం
X
ఇప్పుడున్న తలనొప్పులు చాలవన్నట్లుగా తెలంగాణ సర్కారుకు మరో సమస్య వచ్చి పడింది. ఫర్లేదు.. చూసుకోవచ్చని భావించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు వేడి రగిల్చింది. ఎమ్మెల్యేల చర్యలపై నిర్ణయానికి స్పీకర్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చన్న భావనలో ఉన్న తెలంగాణ సర్కారు.. తాజాగా సుప్రీంకోర్టు సూచన తెర మీదకు వచ్చిన నేపథ్యలో.. ఫిరాంపుల వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని తెలపాల్సిందిగా హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా స్వల్ప గడువు ఇవ్వటం కాస్తంత ఇబ్బందికరమే.

గురువారం ఈ అంశంపై కోర్టు విచారించి.. తదుపరి వాయిదాను ఈ నెల 22కు వేయటంతో.. స్పీకర్ అభిప్రాయాన్ని చెప్పటానికి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిరాయింపుల ఫిర్యాదుపై ఏదో ఒక నిర్ణయం మరో ఆరు రోజుల్లో తీసుకోవాల్సిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు (స్పీకర్) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఈ నెల 22 నాటికి స్పీకర్ తరఫున వాదనను తెలంగాణ ఏజీ చెబుతారా? లేక.. మరింత సమయం కోరతారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే.. హైకోర్టు స్పందన ఎలా ఉంటుందన్న దానిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఫిరాయింపుల వ్యవహారం తాజాగా తెలంగాణ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారిందటనంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.