Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ప‌నైపోయింది... ఇక నెక్ట్స్ కాంగ్రెస్సేనా..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 9:32 AM GMT
టీఆర్ఎస్ ప‌నైపోయింది... ఇక నెక్ట్స్ కాంగ్రెస్సేనా..!
X
టీఆర్ఎస్ నేత‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వ‌చ్చింది. జిల్లాల అధ్య‌క్షుల ప‌ద‌వుల భ‌ర్తీ పూర్త‌యింది. ఇన్నాళ్లూ క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తూ వ‌స్తున్న నాయ‌కులకు పార్టీ అధిష్ఠానం ఇటీవ‌ల వరుస ఆఫ‌ర్లు ఇస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్సీ ప‌ద‌వులు.. ప‌లు కార్పొరేష‌న్ల ప‌ద‌వులు చేప‌ట్టి శ్రేణుల‌ను సంతృప్త ప‌రిచిన టీఆర్ఎస్ ఇపుడు జిల్లాల అధ్య‌క్షుల‌ను నియ‌మించింది. ఏకంగా 33 జిల్లాల‌కు ఒకేసారి నియామ‌కాలు జ‌రిపింది.

ఇందులో అత్య‌ధికులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిప‌ల్‌, జ‌డ్పీ ప‌ద‌వుల్లో ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని వీరిని నియ‌మించిన‌ట్లు తెలుస్తోంది. ఇక పార్టీ రాష్ట్ర క‌మిటీ ఒక‌టే పెండింగ్ లో ఉంది. అది కూడా ప్ర‌క‌టిస్తే ఇక ఇప్ప‌ట్లో ఎలాంటి ప‌ద‌వులు అధికార పార్టీలో ఉండ‌వు. ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే టీం ప‌నిచేస్తుంది.

ఇక అంద‌రి చూపు కాంగ్రెస్ పై ప‌డింది. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న జిల్లాల అధ్య‌క్షుల మార్పు.. రేపు మాపు అంటూ నాన్చుతూ వ‌స్తున్నారు. రేవంత్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి ఆర్నెల్లు పూర్త‌యినా అధ్య‌క్షుల‌ను మాత్రం క‌దిలించ‌లేదు. ఉత్త‌మ్ హ‌యాంలో నియామ‌క‌మైన వారే ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. టీఆర్ఎస్ జిల్లాల అధ్య‌క్షుల ప‌ద‌వుల భ‌ర్తీ కంటే ముందే వెలువ‌డాల్సిన జాబితా ప‌లు కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి అధ్య‌క్షుల మార్పు ప్ర‌క‌ట‌న‌ను కావాల‌నే జాప్యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌నిచేసే వారికే ప‌ట్టం క‌ట్టాల‌ని.. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కృషి చేసే వారినే అంద‌లం ఎక్కించాల‌ని యోచిస్తున్నారు. ఈ దిశ‌గా ఆయ‌న అధ్య‌య‌నం చేస్తున్నార‌ట‌. రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లు, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఎవ‌రు విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు.. ప్ర‌స్తుతం డిజిట‌ల్‌ స‌భ్య‌త్వ న‌మోదులో ఎవ‌రి ప‌నితీరు ఏమిటి.. అనే అంశాల‌ను ప్రామాణికంగా తీసుకొని నియామ‌కాలు చేప‌డ‌తార‌ట‌. 2023 ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా ఈ నియామ‌కాలు ఉంటాయ‌ట‌.

అయితే.. ఈ అంశంపై పార్టీలోని మ‌రో వ‌ర్గం నేత‌లు అనుమాన‌పు చూపులు చూస్తున్నార‌ట‌. అస‌మ్మ‌తి వ‌ర్గానికి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌లో రేవంత్‌ ఉన్నార‌ని.. అధ్య‌క్షుల ఎంపిక‌లో త‌మ వ‌ర్గానికీ ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని ఆ నేత‌లు కోరుతున్నార‌ట‌. లేదంటే పార్టీతో తాడో పేడో తేల్చుకుంటామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. ప్ర‌క‌ట‌న జాప్యం కావ‌డానికి ఇది కూడా ఒక కార‌ణంగా తెలుస్తోంది. ఈ నెలాఖ‌రుతో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు గ‌డువు ముగుస్తున్నందున‌.. క‌నీసం వ‌చ్చే నెల అయినా అధ్య‌క్షుల మార్పు ఉంటుందనే ఆశతో పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. చూడాలి మ‌రి రేవంత్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో..!