Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌.. చెప్పిందొక‌టి చేస్తున్నదొకటి

By:  Tupaki Desk   |   11 Nov 2021 3:30 PM GMT
టీఆర్ఎస్‌.. చెప్పిందొక‌టి చేస్తున్నదొకటి
X
ఉద్య‌మ పార్టీగా ఆవిర్భ‌వించి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన టీఆర్ఎస్.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం ఉద్య‌మాలు, ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌ను తొక్కేయాల‌ని చూస్తుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు కానీ ప్ర‌జా సంఘాలు కానీ సాధార‌ణ జ‌నాలు కానీ నిర‌స‌న‌ల‌కు దిగితే ఉక్కు పాదంతో సీఎం కేసీఆర్ వాటిని అణిచివేస్తున్నార‌ని అన్నివైపుల నుంచి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ధ‌ర్నాలు చేయొద్ద‌ని గ‌తంలో రాష్ట్ర ప్రభుత్వం హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్కు ద‌గ్గ‌ర ఉన్న ధ‌ర్నా చౌక్‌ను నిషేధించింది. కానీ ఇప్పుడు అదే వేదిక‌గా ఆ పార్టీనే ధ‌ర్నా చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు భాగ్య‌న‌గ‌రంలో ఏ రాజ‌కీయ పార్టీగానీ, ఏ సంస్థ‌గానీ జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేయొద్ద‌ని గ‌తంలో మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. కానీ ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా న‌గ‌ర‌మంతా గులాబీ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌తో నిండిపోయింది. దీంతో టీఆర్ఎస్ చెప్పేదొక‌టి చేసేదొక‌ట‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

2014లో ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించిన త‌ర్వాత ఆ ఏడాది ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ రెండేళ్ల‌కే అంటే 2016లో ధ‌ర్నా చౌక్‌ను ఎత్తేసింది. అక్క‌డ ధ‌ర్నాల‌తో ప్ర‌జా జీవ‌నానికి ఇబ్బంది క‌లుగుతుంద‌ని టీఆర్ఎస్ ఆ వేదిక‌ను నిషేధించింది. ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ లాగా.. హైద‌రాబాద్‌లో ఉద్య‌మ గొంతుక వినిపించేందుకు ఇందిరా పార్కు ద‌గ్గ‌రా ఈ ధ‌ర్నా చౌక్ ఉండేది. న‌గ‌రంలో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ కాకుండా నిర‌స‌న‌ల కోసం ఓ ప్ర‌త్యేక‌మైన చోటు ఉండాల‌ని ఈ ధ‌ర్నాచౌక్‌ను గుర్తిస్తూ 2005లో అప్ప‌టి సీఎం వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి జీవో జారీ చేశారు.

అప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇక్క‌డ ధ‌ర్నాలు, దీక్ష‌లు, ఆందోళ‌న‌లు, స‌భ‌లు నిర్వ‌హించేవాళ్లు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న అనే ప‌దం వినిపించ‌కూడ‌ద‌నే సీఎం కేసీఆర్ దీన్ని నిషేధించార‌ని విమ‌ర్శ‌లున్నాయి. కానీ ఆ నిర్ణ‌యంపై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. రాజ‌క‌యీ నేత‌ల‌తో పాటు కొంత‌మంది హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో 2018లో ధర్నాచౌక్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాయి జారీ చేసింది. అప్ప‌టి నుంచి అక్క‌డ మ‌ళ్లీ నిర‌స‌న‌లు తెలిపే అవ‌కాశం ద‌క్కింది.

గ‌తంలో తామే నిషేధించిని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద ఇప్పుడు టీఆర్ఎస్ ధ‌ర్నా చేసేందుకు సిద్ధ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వం వ‌రి కోనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ శుక్ర‌వారం నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధ‌ర్నాలు చేయాల‌ని టీఆర్ఎస్ త‌మ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేయాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఆ మేర‌కు అక్క‌డ ఏర్పాట్ల‌ను మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌హ‌మూద్ అలీ త‌దిత‌రులు ప‌రీశించారు. దీంతో టీఆర్ఎస్ వైఖ‌రిపై మ‌రోసారి స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.