Begin typing your search above and press return to search.

హ‌రీష్ కు ఉపఎన్నిక బాధ్య‌త‌లు.. కేసీఆర్ వ్యూహం అదేనా?

By:  Tupaki Desk   |   28 July 2021 2:30 AM GMT
హ‌రీష్ కు ఉపఎన్నిక బాధ్య‌త‌లు.. కేసీఆర్ వ్యూహం అదేనా?
X
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత కీల‌క‌మైన‌దో అంద‌రికీ తెలిసిందే. రెండు ద‌శాబ్దాల‌పాటు టీఆర్ఎస్ లో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్.. కేసీఆర్ కు ఎదురు తిరిగిన ఎన్నిక‌. టీఆర్ఎస్ ను కూల‌దోయ‌బోతున్నామ‌ని సింహ‌నాదం చేస్తున్న బీజేపీ స‌త్తా చాటాల‌ని చూస్తున్న ఎన్నిక‌. ఈ ఎన్నికలో గ‌న‌క‌ ఓడిపోతే.. టీఆర్ఎస్ ప‌ని అయిపోయింద‌నే ప్ర‌చారం ఓ రేంజ్ లో సాగుతుంది. మ‌రి, ఇంత‌టి కీల‌కమైన ఎన్నిక‌లో కూడా కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం లేదు. భావి ముఖ్య‌మంత్రిగా భావిస్తున్న కేటీఆర్ కు సైతం బాధ్య‌తలు ఇవ్వ‌లేదు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ప్రాధాన్యం లేకుండా చేశార‌ని అంద‌రూ భావించే.. హ‌రీశ్ రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు కేసీఆర్‌. వినోద్ కుమార్ ను తోడు ఇచ్చినా.. ఆయన ప్రభావం నామమాత్రమేనని చెబుతున్నారు. మరి, ఈ నిర్ణయంతో.. ఒకే దెబ్బ‌కు కేసీఆర్ ఎన్ని పిట్ట‌లు కొట్టే ప్లాన్ వేశారు? కేసీఆర్ కత్తికి ఎన్నివైపులా పదునుంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

కేసీఆర్ గ‌న‌క ఈ ఎన్నిక బాధ్య‌త‌ను తీసుకుంటే.. నేరుగా ప్ర‌భుత్వంతో ఈట‌ల త‌ల‌ప‌డిన‌ట్టుగా అవుతుంది. అప్పుడు ఎన్నికకు ఎక్క‌డ‌లేని హైప్ వ‌చ్చేస్తుంది. ఇది ఒక‌ర‌కంగా కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతుంది. ఒక‌వేళ కేసీఆర్ సార‌థ్యంలో గ‌న‌క ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓడిపోతే.. ముఖ్య‌మంత్రి ప‌ని అయిపోయింద‌ని బీజేపీ స‌హా విప‌క్షాలు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తాయి. ఇది రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీకి అతి పెద్ద మైన‌స్ గా మారుతుంది. అందువ‌ల్లే.. కేసీఆర్ ఈ ఎన్నిక ప్ర‌చార బాధ్య‌తలు తీసుకోలేదంటున్నారు విశ్లేష‌కులు.

ఇక‌, కేటీఆర్ కు ఇవ్వ‌క‌పోవ‌డానికి కూడా ఇదే కార‌ణాన్ని చూపిస్తున్నారు. భావి ముఖ్య‌మంత్రిగా ఫీల‌ర్లు వ‌దులుతున్న నేప‌థ్యంలో.. ఒక‌వేళ కేటీఆర్ సార‌థ్యంలో కార‌ను ఓట‌మి పాలైతే మొద‌టికే మోసం వ‌చ్చేస్తుంది. కేటీఆర్ పై విప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడిని తీవ్ర‌త‌రం చేస్తాయి. అంతేకాకుండా.. కేటీఆర్ ఓడిపోతే కేసీఆర్ కు సైతం అనివార్యంగా భాగం వ‌చ్చిప‌డుతుంది. ఈ కార‌ణాల వ‌ల్ల‌నే కేటీర్ కు సైతం బాధ్య‌త‌లు ఇవ్వ‌లేద‌ని అంటున్నారు.

మిగిలింది హ‌రీష్ రావు. ''తెడ్డు ఉండ‌గా చెయ్యి కాల్చుకోవాల్సిన అవ‌స‌రం ఏంటీ?'' అన్నది పాపులర్ సామెత. ఈ యాంగిల్ లో మ‌రోసారి హ‌రీష్ రావును తెర‌పైకి తెచ్చార‌ని అంటున్నారు. టీఆర్ఎస్ ఎక్క‌డ ఓడిపోయే అవ‌కాశం ఉందో అక్క‌డ హ‌రీష్ రావును వాడుతున్నార‌ని, గెలిచే చోట మాత్రం కేటీఆర్ కు బాధ్య‌త‌లు ఇస్తున్నార‌నే ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. దుబ్బాక ఉప ఎన్నిక‌నే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతారు. అక్క‌డ గులాబీ పార్టీ ఓడిపోతుంద‌ని ముందుగానే ప్ర‌చారం సాగింది. అనుకున్న‌ట్టుగానే జరిగింది. చ‌ర్చ‌ హ‌రీష్ మీదుగా వెళ్లిపోయింది. జీహెచ్ఎంసీలో మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని భావించింది గులాబీ పార్టీ. అందుకే కేటీఆర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే ప్ర‌చారం సాగింది. అయితే.. ఊహించ‌ని విధంగా.. బీజేపీ ప్ర‌భావం చూపింది. ఇప్పుడు హుజూరాబాద్ కూడా ఈజీగా లేదు. ఈట‌లతో పోటీ ట‌గ్ ఆఫ్ వార్ అన్న‌ట్టుగా ఉంది. కాబ‌ట్టి.. హ‌రీష్ ను వాడేస్తే స‌రి అన్న ఆలోచ‌న‌తోనే గులాబీ అధినేత ఆయ‌న‌కు ప‌గ్గాలు అప్ప‌గించార‌ని అంటున్నారు.

పైపెచ్చు.. ఈటల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతూ హ‌రీష్ ను చ‌ర్చ‌లోకి లాగారు. మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హ‌రీష్ కూడా ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నార‌ని అన్నారు. దీనికి ఆ త‌ర్వాత హ‌రీష్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పుడు హ‌రీష్ ను రంగంలోకి దించ‌డం ద్వారా.. ఈట‌ల‌తో త‌న‌కు సాన్నిహిత్యం లేద‌ని నిరూపించుకోవాల్సిన అనివార్య ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ విధంగా.. ప్ర‌ధాన బాధ్య‌త‌ను ఆయ‌న‌పై పెట్టిన‌ట్టు అయ్యింద‌ని అంటున్నారు. ఈ ఎన్నిక‌లో గెలిస్తే.. చ‌ర్చ టీఆర్ఎస్ అభివృద్ది మీద‌కు వెళ్లేలా.. ఓడిపోతే హ‌రీష్ మ‌రోసారి బాధ్య‌త‌త తీసుకునేలా వ్యూహం ర‌చించార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.