Begin typing your search above and press return to search.

ఈ నెల 7న టీఆర్ ఎస్ కీలక భేటీ.. సీఎం కేసీఆర్ ఆ కీలక ప్రకటన చేస్తారా?

By:  Tupaki Desk   |   5 Feb 2021 10:00 AM GMT
ఈ నెల 7న టీఆర్ ఎస్ కీలక భేటీ.. సీఎం కేసీఆర్ ఆ కీలక ప్రకటన చేస్తారా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆదివారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన అధ్యక్షతన టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది.ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో పార్టీ పరమైన అంశాలపై చర్చించనున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ , ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇతర సంస్థాగత అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిపి పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయడానికి చేయవలసిన కార్యాచరణను కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశముంది.

ఇదిలా ఉంటే , గత కొన్ని రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ త్వరలో భాద్యతలు స్వీకరించనున్నారు అంటూ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీకి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయబోయే అంశంపై సీఎం కేసీఆర్ నేతలకు క్లారిటీ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతుంది. అతి త్వరలోనే తన కుమారుడిని సీఎం చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని.. ఇందుకు సంబంధించి ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే , దీనిపై సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే అంశంపై ఈ సమావేశంలోనే తీర్మానం చేసే అవకాశం కూడా లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల్లోని నేతలు ఈ సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేయడంతో.. ఆ దిశగా ఈ భేటీలో నిర్ణయాలు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటుగా రాష్ట్రంలో రోజురోజుకి బీజేపీ బలం పెరిగిపోతున్న నేపథ్యంలో బీజేపీ ని ఎలా ఎదుర్కోవాలో సీఎం కేసీఆర్ నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది.