Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఆప్తుడి క్ష‌మాప‌ణ‌లు

By:  Tupaki Desk   |   31 March 2017 4:20 AM GMT
అధికార పార్టీ ఎమ్మెల్యే ఆప్తుడి క్ష‌మాప‌ణ‌లు
X
అధికారం చేతిలో ఉంది క‌దా అనే భ‌రోసా, పార్టీ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌ర అనే ధీమాతో వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుడు ఉద్యోగుల ఆందోళ‌న‌ల‌కు దిగిరాక త‌ప్ప‌లేదు. ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేసిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రధాన అనుచరుడు, నిజామాబాద్ పట్టణ టీఆర్ఎస్‌ నాయకుడు ఆబిద్ సోఫీ ఎట్టకేలకు ఉద్యోగ సంఘాల నిరవధిక నిరసనలకు దిగిరాక తప్పలేదు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘం ప్రతినిధుల సమక్షంలో ఇరిగేషన్ అధికారులకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అధికారులను కించపర్చాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యల వల్ల మనస్థాపం చెంది ఉంటే మన్నించాలని అందరి సమక్షంలో కోరుతూ ఇరిగేషన్ డీఈతో పాటు తాను దూషించిన ఇతర అధికారులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

బోధన్ నియోజకవర్గం పరిధిలోని రెంజల్ మండలం కందకుర్తి ఎత్తిపోతల వద్ద గత పది రోజుల క్రితం ఆబిద్‌ సోఫీ ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులను అసభ్య పదజాలంతో దూషించగా, సదరు వీడియో క్లిప్పింగ్‌ లు వాట్సాప్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ గత సోమవారం నుండి అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు టిఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన బాట చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమాన్ని బహిష్కరించడంతో పాటు మూడు రోజులుగా పెన్‌డౌన్ సమ్మె కొనసాగిస్తూ విధులు బహిష్కరించి కలెక్టరేట్‌ లోని ప్రగతిభవన్ ఎదుట ధర్నాలు చేశారు. గురువారం కూడా ఈ నిరసనలు కొనసాగాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో వివాదం అంతకంతకూ రాజుకుంటుండడం, ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరుగుతూ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ఏర్పడడంతో ఎమ్మెల్యే షకీల్, ఇతర తెరాస ముఖ్య నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. వారి సూచన మేరకు ఆబిద్‌సోఫీ ఇరిగేషన్ అధికారులకు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/