Begin typing your search above and press return to search.
పవన్ టూరు వెనక టీఆర్ ఎస్ ముఖ్యనేత
By: Tupaki Desk | 25 Jan 2018 6:14 AM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్ ఆసక్తికరమైన పరిణామాల వేదికగా మారింది. పవన్ ను కలిసేందుకు ఖమ్మం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించి బుధవారం ఉదయం కొత్తగూడెంలోనూ - సాయంత్రం ఖమ్మంలోనూ ఆయనతో అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు. అధికార టీఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ - టీడీపీలకు చెందిన పలువురు నేతలు ఆయనను కలిసి సంఘీభావం తెలిపినట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లాలో పార్టీల పరిస్థితులు - తమ నేపథ్యం కూడా చెప్పారని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పవన్ కల్యాణ్ కార్యక్రమ ఏర్పాట్లను టీఆర్ ఎస్ కు చెందిన నేతలే చేస్తుండగా ఖమ్మంలో మాత్రం బహిరంగంగా బయటపడకుండా లోపాయికారిగా మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రెండుజిల్లాల పరిధిలో సుమారు 80 కిలోమీటర్ల మేర బుధవారం పవన్ కల్యాణ్ ర్యాలీ చేపట్టగా ఇందుకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాట్లను కూడా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ నేతలే చేపట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు ప్రధాన నేతలు తాము బయటపడకుండా తమ అనుచరులతో ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించే నేత ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ను కలిసేవారిలో ఆ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ జిల్లా పర్యటన తరువాత రాజకీయ పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే మరుసటి రోజున ఆయనను హైదరాబాద్ లో కలిసేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్న నేతలతో పాటు ప్రస్తుతం అధికార టిఆర్ ఎస్ లో అసంతృప్తులుగా ఉన్న నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
కాగా, కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు యువత బ్రహ్మరథం పట్టారు. మంగళవారం రాత్రే కొత్తగూడెం చేరుకున్న ఆయన బుధవారం ఉదయం అక్కడి యువతను పలకరించారు. అనంతరం కొత్తగూడెం సమస్యలపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ భారీ కాన్వాయ్ తో ఖమ్మం బయలుదేరారు. ప్రతి గ్రామంలోనూ ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్ల వెంట నిలబడ్డారు. అయితే పోలీసుల అనుమతి లేకపోవడంతో ఆయన ఎక్కడా మాట్లాడకుండానే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 80కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో యువత మోటారు బైక్ లతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీలో వందకు పైగా కార్లు - వందల సంఖ్యలో బైక్ లతో అభిమానులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల వద్ద అభివాదం చేసే సమయంలో అనేక మంది పూలమాలలు విసిరివేయగా - మరికొందరు జనసేన జెండాలు ఊపుతూ ఆనందం వ్యక్తం చేశారు.