Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు మంట పుట్టే ప‌ని చేసిన డీఎస్!

By:  Tupaki Desk   |   10 July 2018 5:19 AM GMT
కేసీఆర్ కు మంట పుట్టే ప‌ని చేసిన డీఎస్!
X
పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలో టీఆర్ఎస్ ను చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. అధినేత నోటి నుంచి వ‌చ్చే మాటే ఫైన‌ల్‌. ఆయ‌న‌కు ఎదురు స‌మాధానం చెప్పే వారు అస్స‌లు క‌నిపించ‌రు. ఆ మాట‌కు వ‌స్తే.. ఏ అంశం పైనా చ‌ర్చ అన్న‌దే ఉండ‌దు. కేసీఆర్ అనుకుంటారు.. పార్టీ నేత‌లు పాటిస్తారంతే. నిర్ణ‌యం ఏదైనా స‌రే.. గులాబీ బాస్ అనుకున్న‌దే. దాన్ని అధినేత అనుకున్న‌ట్లుగా అమ‌లు చేయ‌ట‌మే గులాబీ పార్టీ ప‌నిగా ఉంటుంది.

ఇలా.. తిరుగులేని రీతిలో పార్టీని న‌డిపిస్తున్న కేసీఆర్‌.. గ‌డిచిన కొన్నేళ్లుగా పార్టీలో ఏం జ‌రుగుతుంద‌న్న అంశంపై పెద్ద‌గా దృష్టి సారించ‌టం.. త‌న ప‌ట్ల నేత‌లు ప్ర‌ద‌ర్శించే భ‌య‌భ‌క్తుల‌కు మురిసిపోయిన వైనం తాజాగా చోటు చేసుకున్న రెండు కీల‌క ప‌రిణామాల‌కు కార‌ణ‌మైంద‌ని చెప్పక త‌ప్ప‌దు.

పార్టీ అధినేత‌గా తిరుగులేని రీతిలో సాగుతున్న కేసీఆర్ మాటే వేద‌మ‌న్న‌ట్లు టీఆర్ ఎస్‌ లో క‌నిపిస్తుంటుంది. అయితే.. ఇదంతా నాణెనికి ఒక‌వైపు మాత్ర‌మే. కేసీఆర్ హ‌వా న‌డుస్తుండటం.. అధికారం ఆయ‌న చేతిలో ఉండ‌టంతో ఆయ‌న ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా మారింది. కొమ్ములు తిరిగి తోపుల్లాంటి నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. కేసీఆర్ జోరుతో వారంతా కామ్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టీఆర్ ఎస్ నేత‌ల‌కు కాస్త స‌న్నిహితంగా మారితే.. అధినేత మీద వారికున్న అసంతృప్తి ఎంత‌న్న‌ది వారి మాట‌ల్లో అర్థం కాక మాన‌దు.

తెలంగాణను శాసించే స‌త్తా ఉండ‌టంతో కేసీఆర్ ఏం చేసినా.. ఎవ‌రూ ఏమీ అన‌ని ప‌రిస్థితి. ఇది ఎక్క‌డివ‌ర‌కూ వెళ్లిందంటే.. షెడ్యూల్ ప్ర‌కారం సాగాల్సిన‌వేమీ సాగ‌ని ప‌రిస్థితి. స‌చివాల‌యానికి కేసీఆర్ వెళ్ల‌రు. ఇంటినే స‌చివాల‌యంగా మార్చేసుకున్నారు. ఇక‌.. ప్ర‌భుత్వ ప‌రంగా రివ్యూలు ఉండ‌వు. ఒక‌వేళ కేసీఆర్‌ కు ఏమైనా అనిపిస్తే.. అప్ప‌టిక‌ప్పుడు రివ్యూలు చేప‌డుతూ ఉంటారు. ఇక‌.. పార్టీ ప‌రంగానూ ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుంది.

పార్టీ నిర్మాణం మీద పెద్ద‌గా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం లేకున్నా.. పార్టీ న‌డుస్తున్న తీరుపైన కేసీఆర్ దృష్టి సారిస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ వ్య‌క్తిగ‌త అంశాల్ని దెబ్బ తీసే ప‌రిణామాలు చోటు చేసుకోక‌పోవ‌టంతో టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రికి వారు.. మ‌న‌కెందుకులే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే.. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు దెబ్బ తినే ప‌రిస్థితే ఎదురైతే.. తిరుగుబాటుకు సిద్ధ‌మ‌న్న‌ట్లుగా నేత‌లు సిద్ధంగా ఉండ‌టం చూస్తే.. కేసీఆర్ కు రానున్న రోజులు క‌ఠినంగా మార‌నున్నాయా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

సీనియ‌ర్ నేత డి. శ్రీ‌నివాస్ కు.. కేసీఆర్ కుమార్తె క‌విత‌కు నిజామాబాద్ స్థానిక రాజ‌కీయాల్లో ఉన్న పంచాయితీ చివ‌ర‌కు డీఎస్ కు పొగ‌పెట్టి బ‌య‌ట‌కు పంపేందుకు రంగం సిద్ధ‌మైంది. డీఎస్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ క‌విత స్వ‌యంగా త‌న తండ్రి క‌మ్ పార్టీ అధినేత‌కు విన‌తిప‌త్రంపెట్టుకున్నారు. అయితే.. అలాంటి వాటిని వెంట‌నే ఆమోదిస్తే.. జ‌రిగే న‌ష్టం గురించి తెలిసిన కేసీఆర్ కామ్ గా ఉన్నారు.

మ‌రోవైపు రామ‌గుండం మున్సిపాలిటీలో పెట్టిన అవిశ్వాసం వ‌ద్దంటూ అధిష్ఠానం ఆదేశాలు ఇవ్వ‌టం.. అందుకు అల‌క వ‌హించిన ఎమ్మెల్యే సోమారం పార్టీ పైనే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తాన‌ని తేల్చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త‌మ ప్ర‌భుత్వంలో అవినీతి లేద‌ని ప్ర‌ధాని మోడీ సైతం కితాబు ఇచ్చిన‌ట్లుగా చెప్పుకునే కేసీఆర్‌కు దిమ్మ తిర‌గేలా.. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్ర‌భుత్వ అవినీతి గురించి ప్ర‌స్తావించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా లోపించింద‌న్న మాట‌తో పాటు.. త‌ప్పు చేసిన వారిని వెన‌కేసుకు వ‌స్తున్నారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

మ‌రోవైపు డీఎస్‌ పైన‌ చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఎంపీ క‌విత పార్టీ అధ్య‌క్షుడికి విన‌తిప‌త్రాన్ని అందించ‌టం తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోన‌ప్ప‌టికి.. న‌గ‌ర శివారులో సోమ‌వారం డీఎస్ త‌న‌కు స‌న్నిహిత నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌తో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత హోట‌ల్లో స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మీడియా ప్ర‌తినిధుల్ని ఆహ్వానించ‌ని ఈ స‌మావేశానికి సంబంధించిన ఫోటోలు కూడా తీసుకోవ‌ద్ద‌ని డీఎస్ వ‌ర్గీయులు స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్ఘం. ఎందుకీ స‌మావేశం అంటే.. భ‌విష్య‌త్ రాజ‌కీయ నిర్ణ‌యం కోస‌మ‌న్న మాట వినిపిస్తోంది. అంటే.. కేసీఆర్ వేటు వేసే స‌మ‌యానికి తానేం చేయాల‌న్న విష‌యంపై డీఎస్ ప‌క్కా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నార‌న్న మాట‌. ఇంత జ‌రుగుతున్నా.. కేసీఆర్ మాత్రం త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు.. త‌న‌దైన ప్ర‌పంచంలో ఉండ‌టాన్ని చూస్తే.. కేసీఆర్ పార్టీకేమైంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.