Begin typing your search above and press return to search.

నల్లగొండ జిల్లాలో టీఆర్ ఎస్ నేత హత్య: పరిస్థితి ఉద్రిక్తత

By:  Tupaki Desk   |   5 July 2020 12:30 PM GMT
నల్లగొండ జిల్లాలో టీఆర్ ఎస్ నేత హత్య: పరిస్థితి ఉద్రిక్తత
X
టీఆర్ ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి తగదాలే హత్యకు దారి తీశాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో జరిగింది. పాత పోలేపల్లికి చెందిన లాలునాయక్‌ (50) రైతు సమన్వయ సమితి చందంపేట మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడు టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు కూడా. అయితే పాత పోలేపల్లి గ్రామ సర్పంచ్‌ గోప్యానాయక్‌ కుటుంబంతో కొంతకాలంగా ఆస్తి తగదాలు ఉన్నాయి. దీనిపై రెండు వర్గాలు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు కూడా చేసుకున్నాయి. ప్రస్తుతం లాలునాయక్‌ కుమార్తె రమావత్‌ పవిత్ర చందంపేట జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతోంది.

చందంపేట మండలం పోలేపల్లి స్టేజీ వద్ద బస్‌ షెల్టర్‌ ను కబ్జా చేసి ఏర్పాటు చేసిన దుకాణాలను ఆర్‌ అండ్‌ బీ అధికారులు - పోలీసులు కలిసి శనివారం తొలగించారు. ఆ సమయంలో అక్కడికి సర్పంచ్ గోప్యానాయక్‌ కుమారుడు విజయ్‌ నాయక్ వచ్చాడు. ఇక్కడ లాలునాయక్‌ - గోప్యానాయక్ అనుచరులు ఒకరికొకరు గొడవపడ్డారు. దీంతో పోలీసులు స్పందించి లాఠీఛార్జి చేసి వారందరినీ చెదరగొట్టారు. అక్కడి నుంచి బిల్డింగ్ తండా గ్రామానికి వెళ్లిన రెండు వర్గాలు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో విజయ్ నాయక్ వర్గీయులు కత్తులతో లాలూనాయక్ తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అతడు కుప్పకూలిపోయాడు.

వెంటనే స్పందించిన అతడి కుటుంబసభ్యులు.. అనుచరులు అతడిని దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ కు తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. లాలు నాయక్‌ హత్య విషయం తెలిసి అతడి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ నాయక్‌ ఇంటిపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డిండి పోలీసులు స్పందించి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి రూరల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.