Begin typing your search above and press return to search.

మిత్రులకి..బీటీ బ్యాచ్ కే పదవులన్నీనా కేసీఆర్?

By:  Tupaki Desk   |   5 March 2017 3:52 PM GMT
మిత్రులకి..బీటీ బ్యాచ్ కే పదవులన్నీనా కేసీఆర్?
X
జెండాలు మోసే వాడు మోస్తూనే ఉంటాడు. పల్లకి మీదకు ఎక్కి తిరిగే వాడు తిరుగుతూనే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యవ్వారం చూస్తే.. ఇదే తీరులో ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర కోసం సుదీర్ఘంగా సాగిన ఉద్యమ సమయంలో.. టీఆర్ ఎస్ పార్టీ జెండాలు మోసినోళ్లు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద వారికున్న కమిట్ మెంట్ తో..వస్తుందో రాదో కూడా తెలీని తెలంగాణ కోసం అదే పనిగా కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకునే వారు.

ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం కావటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని.. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను వదిలేసి.. తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ కు అధికారాన్ని కట్టబెట్టారు. తంతే బూరలబుట్టలోనో.. గారెల బుట్టలోనో పడే తీరుకు భిన్నంగా.. ఒకేసారి రెండింటిలోనూ పడినట్లుగా ఫీలయ్యారు టీఆర్ ఎస్ నేతలు.. కార్యకర్తలు. తాము పడిన కష్టాలు ముగిసినట్లేనని.. తాము కలలు కన్న రాష్ట్రంలో.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ.. పదవుల్ని చేపడతామన్న ఆశ చాలామందిలో వ్యక్తమైంది.

అయితే.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీ.. కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి బంగారు తెలంగాణ సాధన కోసం వచ్చిన బీటీ బ్యాచ్ దెబ్బకు పదవుల కల చెదిరిపోయే పరిస్థితి. ముందొచ్చిన చెవుల కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా.. తెలంగాణ కోసం చెప్పులు అరిగేటట్లు తిరిగి.. బంద్ లు.. నిరసనదీక్షలు.. వంటావార్పులు.. లాఠీ దెబ్బలు తిన్నవారి కంటే.. తెలంగాణ వచ్చేశాక.. బంగారు తెలంగాణ కోసం దర్జాగా వచ్చేసినోళ్లు పదవులు కొల్లగొడుతుంటే.. టీఆర్ ఎస్ నేతలు నోరెళ్ల బెట్టి చూసే పరిస్థితి.

ఇప్పటివరకూ ఇలానే సాగినా.. ఇప్పటికైనా అధినేతలో ఎంతోకొంత మార్పు వస్తుందని భావించిన వారికి.. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు చూసిన వారిపై టీఆర్ ఎస్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన బీటీ బ్యాచ్.. మిత్రులకు సింహభాగాన్ని ఇవ్వటంపై లోలోన రగిలిపోతున్న పరిస్థితి.

ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల్లో హనుమంతరావు.. గంగాధర్ గౌడ్ లు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారు కాగా.. మిత్రుడిగా ఉన్న మజ్లిస్ కు చెందిన జాఫ్రీకి స్థానిక సంస్థల కోటా కింద మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక.. మిగిలిన వారిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి. ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రుడే కాదు.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. గవర్నర్ కోటాలో స్థానం పొందిన రాజేశ్వరరావు.. ఫారూఖ్ హుస్సేన్ లు మరోసారి అవకాశం దక్కించుకున్నారు. ఇలా చూసినప్పుడు.. ఇలా చూసినప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో సింహ భాగంగా మిత్రులకు.. బీటీ బ్యాచ్ కే పదవుల పందేరం సరిపోయిందన్న విమర్శ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/