Begin typing your search above and press return to search.

ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా?

By:  Tupaki Desk   |   19 Nov 2020 12:30 AM GMT
ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా?
X
తుది ఫలితంపై క్లారిటీ ఉన్న గ్రేటర్ ఎన్నికలపై హైప్ పెంచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన జోష్ లో ఉన్న ఆ పార్టీ అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేస్తోంది. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు టీఆర్ఎస్ నేతలతో బీజేపీ నేతలు రహస్య సంభాషణలు జరుపుతున్నట్లుగా వస్తున్న వార్తలు గులాబీ తోటలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇలాంటివేళ.. ఈ గుబులు మరింత పెరిగేలా వ్యాఖ్యలు చేశారు అదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు.

ఒకట్రెండు రోజుల్లో పది మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారన్నారు. కేసీఆర్.. కేటీఆర్ నాయకత్వం మీద ఉన్న అసంతృప్తి కారణంగా కారు దిగేసి కమలం గూటికి చేరనున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వంద డివిజన్లు గెలవనుందని.. మేయర్ అభ్యర్థిని ప్రకటించటానికి అధికారపార్టీ భయపడుతోందన్నారు.

టీఆర్ఎస్ పార్టీ కనుక మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. బీజేపీ అంటే భయంతోనే టీఆర్ఎస్ పార్టీ రాయితీల్ని ప్రకటిస్తోందని చెబుతున్నారు. బీజేపీ గూటికి వచ్చే పది మంది టీఆర్ఎస్ నేతలు ఎవరన్న విషయాన్ని మాత్రం బాబురావు చెప్పే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం. అయితే.. బాబూరావు మాటల్ని గులాబీ పార్టీ సీరియస్ గా తీసుకోవటం లేదు.

తాము టికెట్ ఇవ్వకుండా రిజెక్టు చేసే నేతలు 10 నుంచి 20 మంది వరకు ఉంటారని.. వారంతా అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళతారని చెబుతున్నారు. తాము వద్దనుకున్న నేతలే పార్టీ మారటం వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నది గులాబీ నేతల వాదన. ‘ఆ నేతలు మా పార్టీలో ఉన్నా.. లేకున్నా ఒకటే. వారి వల్ల మాకెలాంటి నష్టం వాటిల్లదు’’ అని చెబుతున్నారు. సోయం బాబూరావు చెప్పినట్లుగా ఒకట్రెండు రోజులు వెయిట్ చేస్తే.. ఎవరి చెప్పింది నిజమో అర్థం కాక మానదు.