Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యంతో ఫైటింగ్‌ లు షురూ

By:  Tupaki Desk   |   1 Nov 2016 9:41 AM GMT
కేసీఆర్ నిర్ణ‌యంతో ఫైటింగ్‌ లు షురూ
X
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత పార్టీపై దృష్టిపెట్టిన గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ నిర్ణ‌యం ఆ పార్టీలోని అసంతృప్తుల‌ను బ‌హిర్గతం చేస్తోంది. ఏకంగా విమ‌ర్శ‌ల స్థాయికి ప‌రిస్థితి చేరిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా తెరాస కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారు. త‌మ‌కు న్యాయం ద‌క్కాలంటే త‌మ‌కే ద‌క్కాల‌ని డిమాండ్లు చేశారు. ఈ క్ర‌మంలో వాదోప‌వాదాలు - పిడిగుద్దుల‌ను నిలువ‌రించ‌డం నాయ‌కుల వంతు కూడా కాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ స‌మావేశంలో జిల్లా నాయకుల మధ్య గత కొంతకాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఉద్యమ సమయం నుంచి పార్టీ విజయతీరాల వరకు పనిచేసిన సీనియర్ నాయకులకు గద్వాలలో ప్రాధాన్యం కరువైందని, కేవలం ఒకే సామాజిక వర్గం - ఒకే వర్గానికి చెందిన నేతల మాటలే చెల్లుబాటవుతున్నాయని సీనియర్లు మండిపడ్డారు. ఈ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ - సీనియర్ నేతలు గట్టు తిమ్మప్ప - విష్ణువర్ధన్‌ రెడ్డి - ఆటో శ్రీనుల మధ్య వాగ్వాదం - పరస్పర దూషణలు - తోపులాటలు చోటు చేసుకున్నాయి. పది నిమిషాల పాటు అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాక కొందరు సీనియర్లు అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపి మంద జగన్నాథం - బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి - చంద్రశేఖర్‌ రెడ్డిలు ఇరువర్గాలను శాంతింపచేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఒకానొక సందర్భంలో గట్టు సోదరులు సీనియర్లకు జరుగుతున్న అన్యాయంపై విరుచుకుపడ్డారు. జిల్లా కార్యకర్తల సమావేశం రసాభసగా మారడంతో సిఐ సురేష్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.

జోగులాంబా జిల్లా అధ్యక్షరేసులో మొదటి నుంచి బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ గట్టు తిమ్మప్ప - ఖగన్నాథ్‌ రెడ్డి - వడ్డేపల్లి శ్రీను తదితరులు కూడా ఈ పదవికి పోటీలో ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్‌ చార్జి - మార్కెట్‌ యార్డు చైర్మన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించడంతో బిసి వర్గంపై పార్టీ దృష్టిసారించినట్లు తెలిసింది. జిల్లాలో జనాభా పరంగా వాల్మీకిబోయలు - మున్నూరుకాపు కులానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడంతో వాల్మీకి కమ్యూనిటీ నుంచి గట్టు తిమ్మప్ప - మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి ఇటిక్యాల జడ్పీటిసి ఖగన్నాథ్‌ రెడ్డి - వడ్డెపల్లి శ్రీనుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామం పార్టీలో ఉన్న అసంతృప్తుల‌ను బ‌య‌ట‌పెట్టింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/