Begin typing your search above and press return to search.

హోంమంత్రి ముందే గులాబీ నేతల తనుకున్నారు.!

By:  Tupaki Desk   |   5 Oct 2020 4:30 PM GMT
హోంమంత్రి ముందే గులాబీ నేతల తనుకున్నారు.!
X
టీఆర్ ఎస్ ‌లో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వస్తున్నాయి. గోషామహల్ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు హోం మంత్రి మహమూద్ అలీ ముందే తన్నుకుచచ్చారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా ఆదివారం గోషామహల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం రాంకోఠిలోని ఒక ఫంక్షన్ హాల్‌ లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారని ప్రకటించారు. ముందుగా నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు నంద కిషోర్ వ్యాస్, కార్పొరేటర్లు మమతా సంతోష్ గుప్తా, పరమేశ్వరి, ముఖేష్ సింగ్‌లను వేదిక మీదకు పిలిచారు.

అయితే నియోజకవర్గానికి చెందిన ఉద్యమ నాయకులు, సీనియర్ నేత ఆర్వీ మహేందర్ అక్కడే ఉన్నప్పటికీ ఆయనను వేదిక మీదకు పిలవకపోవడంతో సీనియర్ నాయకుడైన తనను వేదిక మీదకు ఎందుకు పిలువలేదని వారిని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో సమావేశానికి హాజరైన వారిలో ఉన్న జాంబాగ్ డివిజన్ ‌కు చెందిన పార్టీ నాయకుడు జైశంకర్ మహేందర్ కుమార్ ‌ను కించపర్చేలా మాట్లాడటంతో గొడవ మొదలైంది. స్టేజీ మీద ఉన్న నాయకులు వారిస్తున్నా వినకుండా ఒకరినొకరు దూషించుకుంటూ రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు.

అక్కడే బందోబస్తులో ఉన్న నారాయణగూడ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవడంతో సమావేశం మొదలైంది. అయితే సమావేశానికి మంత్రి తలసానికి ఆలస్యమవడంతో ఆయన గొడవ సద్ధుమణిగే సమయానికి అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు, నాయకులు వారిని నిలువరించి ఆర్‌వీ మహేందర్‌ను వేదికపైకి ఆహ్వానించారు. కార్యక్రమం ముగియడంతో మంత్రులు, అధికారులు వెళ్లిపోతున్న సమయంలో బయట మరోసారి దూషించుకుంటూ తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగా, ఇరువర్గాల వారు దాడులు చేసుకున్నారు. దీంతో సుమారు గంటపాటు రోడ్డుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్వీ మహేందర్ కుమార్, జయశంకర్ గతంలో పార్టీ కోసం కలిసి పని చేశారు. అయితే గత కొన్నినెలలుగా వారి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వారిద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం నియోజకవర్గం నాయకులను విస్తుపోయేలా చేసింది.