Begin typing your search above and press return to search.

కేసీఆర్ సార్.. నీకు అర్థమవుతోందా? కాస్త దయ చూపవయ్యా?

By:  Tupaki Desk   |   14 Feb 2020 12:30 PM GMT
కేసీఆర్ సార్.. నీకు అర్థమవుతోందా? కాస్త దయ చూపవయ్యా?
X
తెలంగాణ సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కి ఏడాది పూర్తయ్యింది. ఇది రెండో ఏడులో రెండు నెలలు కూడా పూర్తయ్యాయి. మంత్రి పదవులు భర్తీ చేయడానికే ఏడాది తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి ఎన్నేళ్లు తీసుకుంటాడో అని గులాబీ దళం కలవరపడుతోందట..

నామినేటేడ్ పదవులపై టీఆర్ఎస్ సీనియర్ నేతలు, పార్టీలో కొత్త గా చేరిన నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే నామినేటేడ్ పదవుల పదవి కాలంలో ఎప్పుడో ముగిసినప్పటికీ నేటికి ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేయడం లేదు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గులాబీ బాస్ తమ నామినేటేడ్ పదవులను రెన్యూవల్ చేస్తారని అందరూ భావించారు. అయితే వారనుకున్నది ఏది జరుగకపోవడంతో నేతల్లో రోజురోజుకు టెన్షన్ పెరుగుతోంది. అంతేకాకుండా పార్టీ లో ఎవరూ ఊహించని వారికి పెద్ద పెద్ద పదవులు దక్కుతుండటంతో నామినేటేడ్ పదవుల్లో తమ పేరు ఉంటుందో లేదో తెలియక ప్రతీరోజూ ప్రగతి భవన్ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు.

* పాత నేతల్లో మొదలైన టెన్షన్..
టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లు, కమిషన్లు కలిపి 50 ఛైర్మన్ల వరకు నామినేటేడ్ పదవులను భర్తీ చేసింది. వీటిలో కమిషన్లు మినహా అన్ని కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. అయితే కేసీఆర్ మాత్రం మూడు కార్పొరేషన్లకు మాత్రమే ఒక సంవత్సరం పాటు పదవీకాలం పొడగించారు.. మిగతా కార్పొరేషన్ల ను రెన్యూవల్ చేయలేదు. దీంతో తమ నామినేటేడ్ పదవులు కేసీఆర్ ఎప్పుడు రెన్యూవల్ చేస్తాడా? అని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్టీఐ పదవుల్లో టీఆర్ఎస్ నేతలు శంకర్ నాయక్, మహ్మద్ అమీర్ లకు పదవులు దక్కడంతో నామినేటేడ్ పదవులు ఆశిస్తున్న నేతల్లో భయం పట్టుకుంది. తమ నామినేటేడ్ పదవులు రెన్యూవల్ అవుతాయా? లేక వీటిలో కొత్త వారిని నియమిస్తారా అనే టెన్షన్ మొదలైంది.

* నామినేటేడ్ పదవుల్లోనూ కేటీఆర్ మార్క్ ఉండనుందా..?
టీఆర్ఎస్ లో కేటీఆర్ హవా పెరిగిపోవడంతో పాత వారి స్థానంలో కొత్తవారికి అవకాశాలు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఐఏఎస్ ల నియామకం దగ్గరనుంచి ప్రభుత్వ కార్యదర్శి నియామకం వరకు అన్ని ఆయనే చూసుకుంటున్నారు. త్వరలోనే కేటీఆర్ కు పట్టాభిషేకం జరుగునుందని ప్రచారం జరుగుతుండటం తో కేటీఆర్ వర్గం నేతలకే ఆ పదవులు దక్కుతాయని.. అందుకే కేసీఆర్ నామినేటేడ్ పదవులను భర్తీ చేయడం లేదని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నామినేటేడ్ పదవులను ఆశిస్తున్న మాజీ ఛైర్మన్లు మాత్రం తమకు పదవీ దక్కక పోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. దీంతో తమ పదవులను రెన్యూవల్ చేయాలని నిత్యం ప్రగతి భవన్ చుట్టూ నేతలు తిరుగుతున్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్.. పాతనేతలకు ఎలా పదవులను సర్దుబాటు చేస్తారో చూడాల్సిందే.