Begin typing your search above and press return to search.

బీజేపీ ట్రాప్‌లో టీఆర్ ఎస్ నేత‌లు.. బూర న‌ర్స‌య్యే ఎగ్జాంపుల్‌

By:  Tupaki Desk   |   15 Oct 2022 3:30 PM GMT
బీజేపీ ట్రాప్‌లో టీఆర్ ఎస్ నేత‌లు.. బూర న‌ర్స‌య్యే ఎగ్జాంపుల్‌
X
మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యం.. మ‌రోవైపు.. ప్రాంతీయ పార్టీ అయిన‌.. టీఆర్ ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా ప్ర‌క‌టించిన సంద‌ర్భం.. వెర‌సి.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు ఇది.. అత్యంత విలువైన కాలం. ఇలాంటి స‌మ‌యంలో వార్డు మెంబ‌ర్ అయినా.. పార్టీలో కీల‌క నాయ‌కుడే..

అలాంటిది.. ఇప్పుడు మాజీ ఎంపీ.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక టికెట్‌ను ఆశించిన బీసీ సామాజిక వ‌ర్గం నాయ‌కుడు.. బూర న‌ర్స‌య్య గౌడ్‌.. టీఆర్ ఎస్‌కు రాం రాం చెప్పారు. తాజాగా ఆయ‌న పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. మ‌రి దీని వెనుక ఏం జ‌రిగింది? ఏంటి విష‌యం అనేది ఆస‌క్తిగా మారింది.

కొన్నాళ్లుగా.. తెలంగాణ‌పై.. బీజేపీ పెద్ద ఎత్తున ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగిస్తున్న విష‌యం తెలిసిందే. అది పార్టీల‌తో సంబంధం లేదు.. ఏ పార్టీ అన్న వివేచ‌న కూడా అస‌వ‌రం లేదు. కేవ‌లం నాయ‌కులు.. బ‌ల‌మైన నాయ‌కులు.. కావాలి అంతే! ఇదే ఫార్ములాతో.. బీజేపీ ముందుకు సాగుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో పార్టీలోని నేత‌ల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త‌, అవ‌స‌రం.. ఆయా పార్టీల‌పైనే ఉంటుంది త‌ప్ప‌.. ఇత‌రరుల‌పై ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే బూర ప‌గిలిపోవ‌డానికి కార‌ణాలు ఏంటో టీఆర్ ఎస్ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం. ఆ దిశ‌గా ఇప్ప‌టికైనా.. అంత‌ర్మ‌థ‌నం చెందాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

ఇక‌. బీజేపీ ట్రాప్‌లో బూర ఎప్పుడో చిక్కుకున్నార‌నే ఇప్పుడు టీఆర్ ఎస్‌లోనే వినిపిస్తున్న మాట‌. అయితే.. ఇది ఆయ‌న కాలు జారిపోయిన త‌ర్వాత‌.. చెప్ప‌డ‌మే చిత్రంగా ఉంది. ప్ర‌స్తుతం న‌ర్స‌య్య గౌడ్ వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న ఎప్ప‌టి నుంచోబీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. కానీ, ఈ విష‌యంపై న‌ర్స‌య్య కానీ, బీజేపీ నేత‌లు కానీ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఏదేమైనా.. కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంంలో బూర లాంటి వ్య‌క్తికి పాచిక విస‌ర‌గ‌ల స‌త్తా.. కేవ‌లం బీజేపీ వంటి.. కేంద్రంలో బ‌లంగా ఉన్న పార్టీకే ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీకి బ‌ల‌మైన నాయ‌కులు లేరు.

పైగా స్థానిక‌త ఉన్న నేతలు అస‌లు లేరు. ఈ నేప‌థ్యంలో బీజేపీ నే ట్రాప్ వేసింద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. ఇదిలావుంటే.. బూర వంటి.. బ‌ల‌మైన నేత‌ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంలోనూ.. అధికార పార్టీ విఫ‌ల‌మైంద‌నే వాద‌న ఉంది. ఆయ‌న‌తో ఆది నుంచి ఈ విష‌యం చ‌ర్చించి ఉంటే బాగుండేది. వాస్త‌వానికి మునుగోడులో రెడ్డి వ‌ర్గం ఓట్ల క‌న్నా.. ఎస్సీ, బీసీల ఓట్లే ప్రామాణికం. ఈ విష‌యాన్ని గ‌మ‌నించే బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింద‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా.. టీఆర్ ఎస్ పెద్ద‌లు క‌ళ్లు తెరుస్తారో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.