Begin typing your search above and press return to search.

ఒకరికి ఒకటంటే.. చాలా మందికి అసంతృప్తే!

By:  Tupaki Desk   |   18 Oct 2015 4:47 AM GMT
ఒకరికి ఒకటంటే.. చాలా మందికి అసంతృప్తే!
X
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్‌ పదవుల పందేరానికి సంబంధించిన కసరత్తు నడుస్తోంది. సాధారణంగా ఆయా శాఖలకు సంబంధించిన నామనేటెడ్‌ పోస్టుల విషయంలో మంత్రుల స్థాయిలో ప్రతిపాదనలు ఫైనలైజ్‌ చేసి సీఎం దృష్టికి తీసుకువెళ్లడూ.. ఆయన తన ఇష్టాయిష్టాలకు, తన వద్ద ఉన్న ఆబ్లిగేషన్ లకు అనుగుణంగా దాని మీద నిర్ణయం తీసుకోవడమూ సహజంగా జరుగుతూ ఉంటుంది. మంత్రులు ఏయే పేర్లతో జాబితాలు తయారు చేసినప్పటికీ.. ఫైనల్‌ గా సీఎం ఏం అనుకుంటే అది మాత్రమే జరుగుతుంది.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దఫా కొంచెం వెరైటీగా వ్యవహరిస్తున్నారు. తమ తమ శాఖల్లో నామినేటెడ్‌ పదవులను నిర్ణయించే స్వేచ్ఛను ఏయే మంత్రులకు విడివిడిగా ధారాదత్తం చేసేయకుండా.. ఒక మంత్రుల కమిటీని నియమించారు. అన్ని రకాల నామినేటెడ్‌ పదవులకు ఈ మంత్రుల కమిటీ అర్హుల పేర్లను నానా రీతుల్లో తూకం వేసి నిర్ణయిస్తుందన్నమాట.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నామినేటెడ్‌ పోస్టుల గురించి మాట ఇచ్చినప్పుడు.. సుమారు 8 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్రస్థాయి పోస్టులు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయన మాటను ఆసరాగా చేసుకుని చాలామంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ లు కూడా రకరకాల పోస్టుల కోసం ఆశలు పెట్టుకుంటున్నారు. దానికోసం పైరవీలు చేసుకుంటున్నారు. వారే రెండేసి పదవులకు ఆశపడుతుండగా.. చిన్న చిన్న పార్టీ పదవులు, కిందిస్థాయిలో ప్రజాప్రతినిధి పదువులు ఉండేవారు కూడా అదనంగా.. ఎగబడి ఎగబడి తమకు కూడా నామినేటెడ్‌ పోస్టులు కావాలని ఆశపడుతున్నారు. ఆ మేరకు పైరవీలు చేసుకుంటున్నారు.

అయితే మంత్రుల కమిటీ ఇప్పుడు కొత్త పితలాటకం పెడుతోంది. ఒకరికి ఒకే పదవి అనే అంశాన్ని తెరమీదకు తెస్తోంది. అయితే దీన్ని ఏ స్థాయి వారి వరకు పరిమితం చేస్తారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. చిన్న వారికి మాత్రమే ఈ సిద్ధాంతం చెబుతారా? లేదా ఎమ్మెల్యేలకు కూడా ఇదే నీతిచెప్పి, వారి ఆశలను తిరగ్గొడతారా అనేది వేచిచూడాలి.