Begin typing your search above and press return to search.

మళ్లీ పోలవరం.. సీలేరు!!

By:  Tupaki Desk   |   16 March 2015 5:30 PM GMT
మళ్లీ పోలవరం.. సీలేరు!!
X
టీఆర్‌ఎస్‌ నేతలు మళ్లీ పోలవరం ముంపు మండలాలు, దిగువ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టుపై పోరాటం ప్రారంభించారు. దీనిపై కాంగ్రెస్‌ను తప్పుబట్టడం మొదలుపెట్టారు. పోలవరం ముంపు మండలాలు ముగిసిన అధ్యాయమని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్లీ మంత్రులు ఆ రెండింటిని ఎందుకు తెరపైకి తెచ్చారు? అంటే, బడ్జెట్‌ విషయంలో తప్పులు పట్టకుండా కాంగ్రెస్‌ను ఆత్మ రక్షణలోకి నెట్టడమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం. అందుకే, తెలంగాణకు అన్యాయం చేశారంటూ కాంగ్రెస్‌ను తప్పుపట్టడమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్తవానికి దిగువ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు నుంచీ ఆంధ్రా ప్రాంతంలోనే ఉంది. తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రా ప్రాంతంలోనూ దిగువ సీలేరు ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో దానిని ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చేర్చారు. దిగువ సీలేరుకు దాదాపు 80 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికితోడు, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాల్సి రావడంతో వాటిలోని సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. పోలవరం ముంపు మండలాలను కలిపితేనే తెలంగాణ అని స్పష్టం చేయడంతో అంతర్గతంగా టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఇందుకు అంగీకరించారు.

అయితే, దిగువ సీలేరు ప్రాజెక్టు అసలు ఆంధ్రా ప్రాంతానిదేనని కాంగ్రెస్‌ పార్టీ చెప్పలేదు కదా! అలా చెబితే అది తెలంగాణకు వ్యతిరేకమంటూ టీఆర్‌ఎస్‌ నాయకులంతా ఒక్కుమ్మడిగా లేస్తారు. తెలంగాణవాదులను, జేఏసీలను ముందుకు తెస్తారు. కాంగ్రెస్‌ను విలన్‌గా చూపిస్తారు. పోలవరం ముంపు మండలాల విషయంలోనూ ఇంతే. ఇది కాంగ్రెస్‌ పార్టీ బలహీనత. ఇక, బడ్జెట్‌లోని లోపాలను కాంగ్రెస్‌ పార్టీ దునుమాడుతోంది. దానికి అడ్డుకట్ట వేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. అందుకే ఎదురు దాడిలో మాస్టర్‌ డిగ్రీ సాధించడమే కాకుండా డాక్టరేట్‌ కూడా చేసేసిన హరీశ్‌ రావు రంగంలోకి దిగారని కాంగ్రెస్‌ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.