Begin typing your search above and press return to search.

ఆ మాట.. బాబును ఒంటరిని చేయటానికేనా?

By:  Tupaki Desk   |   8 Jun 2015 3:06 PM GMT
ఆ మాట.. బాబును ఒంటరిని చేయటానికేనా?
X
విభజనకు ముందు.. విడిపోయి కలిసి ఉందాం అన్న మాటను టీఆర్‌ ఎస్‌ నేతలు పదే పదే చెప్పేవారు. వారు చెప్పే మాటల్లో నిజం ఎంతన్నది రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. విభజన తర్వాత కూడా సీమాంధ్ర ప్రజలకు సంబంధించి తెలంగాణ అధికారపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. తీసుకుంటున్న నిర్ణయాలు వారికి ఇబ్బంది పెట్టేవిగా ఉండటం తెలిసిందే.

అయితే..తాజాగా ఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చిన. వీడియో.. ఆడియో టేపుల వ్యవహారంలో మాత్రం టీఆర్‌ ఎస్‌ నేతల వైఖరి కాస్త భిన్నంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినవని చెబుతూ విడుదల చేసిన ఆడియో టేప్‌ తర్వాత.. పలు సందర్భాల్లో టీఆర్‌ ఎస్‌ నేతలు మాట్లాడుతూ.. ఈ టేపుల వ్యవహారం.. చంద్రబాబు నాయుడి నీచ రాజకీయాలకు సంబంధించి తప్పించి.. తెలంగాణ.. ఆంధ్రరాష్ట్రలకు సంబంధించి కాదని.. ఏపీ ప్రజలకు ఏ మాత్రం దీనితో సంబంధం లేదని వ్యాఖ్యానించటం గమనారÛం.

తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకునే నిర్ణయాల వల్ల రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. తాజా పరిణామాలు సీమాంధ్రలో సానుభూతిని తెచ్చేవిగా మారాయి. ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని తెలంగాణ అధికారపక్షం.. ఆ భావనను తగ్గించేలా ఉండేందుకే.. టేపుల వ్యవహారం ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేనిది.. పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అధికారపక్ష నేతలు సీమాంధ్ర ప్రజల గురించి మాట్లాడారంటే అందులో ఎంతోకొంత రాజకీయం ఉండకుండా ఉంటుందా..? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.