Begin typing your search above and press return to search.

పెద్దాయన్ను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారా?

By:  Tupaki Desk   |   22 Dec 2016 11:08 AM IST
పెద్దాయన్ను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారా?
X
తెలంగాణ రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా పెద్దాయనగా పిలుచుకునే నేతలు ఎవరైనా ఉన్నారా అంటే.. అందులో జానారెడ్డి పేరు ప్రముఖంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఎక్కడిదాకానో ఎందుకు అసెంబ్లీలో సైతం.. జానారెడ్డిని ఉద్దేశించి తెలంగాణ అధికార పక్షం నేతలు సైతం అప్పుడప్పుడు పెద్దాయన అంటూ సంబోధించటం కనిపిస్తుంది. ఇంతలా మర్యాద ఇస్తున్నట్లు కనిపించినా.. ఆయన్ను మాత్రం తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారనే చెప్పాలి.

కేవలం అధికారపక్షం మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం ఆయన్ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నట్లుగా చెప్పొచ్చు. పెద్ద మనిషి అంటూ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నట్లే మాట్లాడుతూనే.. విరుచుకుపడటం.. ఆయన్ను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో టీఆర్ ఎస్ నేతలకు మించినోళ్లు మరొకరు ఉండరనే చెప్పాలి. జానారెడ్డిలో ఉండే లోపాన్ని గుర్తించిన తెలంగాణ అధికారపక్షం ఆయన్ను ఒక ఆట ఆడుకుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

తెగించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడలేని బలహీనత (ఇప్పటి పరిస్థితుల్లో దీన్ని లోపంగా చెప్పాల్సిందే) ఆయన సొంతం. సమకాలీన రాజకీయాలకు భిన్నమైన మైండ్ సెట్ ఉన్న ఈ పాతతరం నేతను రెచ్చగొట్టేలా మాట్లాడి.. ఆవేశంలో ఆయన నోటి వెంట ఏదో ఒక మాటను వచ్చేలా చేయటం.. దానికి చాటలు కట్టి.. ఎంత దారుణంగా మాట్లాడారో చూశారా? అంటూ కలర్ ఇవ్వటం చూసినప్పుడు జానాకు ఎన్ని కష్టాలో అన్న భావన కలగక మానదు.

ప్రస్తుత రాజకీయాలకు తన లాంటి పాతతరం నేత సరిపోడదన్న విషయం జానాకు తెలియంది కాదు. అవసరానికి తగ్గట్లుగా మాటల్నిమార్చేసే దిగజారుడుతనం జానాకు లేదనే చెప్పాలి. టీఆర్ ఎస్ నేతలు మాట్లాడినంత స్పీడ్ గా మాట్లాడలేకపోయినా.. పాతతరం నేత అన్న ట్యాగ్ లైన్ కు తగ్గట్లే.. ఒద్దిగ్గా.. పద్దతిగా.. మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. అయితే.. ఇలాంటి వాటిని ఏ మాత్రం గుర్తించకుండా.. ఆయనపై పరుషంగా మాట్లాడుతూ.. ఆయనకు ఎక్కడో కాలిపోయేలా చేయటంలో టీఆర్ ఎస్ నేతలు నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో తమ వైరిపక్షంపై విమర్శలు చేసే విషయంలో ఆయన కాస్తంత నెమ్మదించినా.. స్వపక్షం నేతలు జానాపై ఫైర్ అయ్యే పరిస్థితి. పార్టీ అంతర్గత సమావేశాల్లో అధికారపక్షాన్ని ఇబ్బందుల్లో పడేసేలా మీరు మాట్లాడటం లేదంటూ గుస్సా అవుతున్న వేళ.. జానా పరిస్థితి చూస్తే.. పరాయి వాళ్లే కాదు.. సొంతోళ్లు కూడా ఆయన్నెంతగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/