Begin typing your search above and press return to search.

పండుగ రోజు మొత్తం తెలంగాణ భవన్ లోనేనా?

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:40 AM GMT
పండుగ రోజు మొత్తం తెలంగాణ భవన్ లోనేనా?
X
తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో ఈ పండుగను ధూంధాం అన్నట్లుగా చేపడతారు. సంవత్సరం మొత్తం ఎవరు ఎక్కడ ఉన్నా.. దసరా వేళకు ఇళ్లకు చేరి.. సొంతూర్లో పెద్ద ఎత్తున పండుగ చేసుకోవటం ఆనవాయితీ. మిగిలిన పండుగల సంగతి ఎలా ఉన్నా.. దసరా వేళ మాత్రం కుటుంబ సభ్యుల్ని తప్పనిసరిగా కలవాల్సిందే. వారితో గడపాల్సిందే. అలాంటి ఈ పండుగ వేళ.. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతలకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

ఇప్పటివరకు ప్రాంతీయపార్టీగా.. అందునా తెలంగాణ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం పోరాడే ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ ఈ నెల 5న తన పేరును మార్చుకొని ప్రాంతీయ స్థానే జాతీయ ట్యాగ్ లైన్ పెట్టేసుకునేందుకు ముహుర్తాన్ని నిర్ణయించటం తెలిసిందే.తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రీతిలో అయితే సాధించారో.. కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎన్నికల్లో షాకిచ్చి.. తాను కీలక స్థానంలో ఉండాలని గులాబీ అధినేత భావిస్తున్నారు.

తన ఆలోచనలకు తగ్గట్లుగా పార్టీని.. పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేసే ప్రయత్నాల్ని ఆయన షురూ చేశారు. ఇందులో భాగంగా దసరా రోజు మధ్యాహ్నం 1.19 గంటల వేళలో జాతీయ పార్టీ పేరును.. విధివిధానాల్ని డిసైడ్ చేయనున్నారు.దీనికి సంబంధించిన పార్టీ కార్యక్రమాన్ని అదే రోజు ఉదయం 11 గంటల వేళలో షురూ చేయనున్నారు. పార్టీకి సంబంధించి కీలకమైన పలువురికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. వారంతా దసరా రోజున ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

పొద్దుపొద్దున్నే ఇంటిని వదిలేసి.. తెలంగాణ భవన్ కు వచ్చి కూర్చుంటే ఎలా? అన్నది గులాబీ నేతల ఆవేదనగా చెబుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే పెద్ద పండుగ రోజున ఇలాంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవాలా? అన్నది ప్రశ్నగా మారింది. ఒకవేళ.. పార్టీ పేరును మార్చే ప్రోగ్రాంను ఒక మోస్తరుగా నిర్వహిస్తే సరిపోయేదని.. అందుకు భిన్నంగా ఉదయాన్నే వచ్చి కూర్చోవాలని చెప్పటంపై గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు.

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో దసరా రోజున ఉదయం 11 గంటలకు ఉండాలని.. ఆహ్వానితుల జాబితాలో రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం.. అనుబంధ విభాగాల అధ్యక్షులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. డీసీసీబీ.. డీసీఎంఎస్.. జిల్లా పరిషత్.. గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు.. టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు హాజరు కావాలని నిర్ణయించారు. ఉదయం టీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటే.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు పార్టీ సర్వసభ్యయ సమావేశాన్ని ముగించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లుగా తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

దీనిపై గులాబీ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంత పార్టీ పేరు మార్చి.. జాతీయ పార్టీగా మార్చాలన్న నిర్ణయాన్ని పండుగ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బాగుండేదని.. ఇంత పెద్ద పండుగ రోజున ఉదయాన్నే ఇంట్లో నుంచి బయలుదేరి సాయంత్రం వరకు అక్కడే ఉండి.. ఊళ్లకు బయలుదేరి.. ఇంటికి చేరుకునేసరికి రాత్రి అవుతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేత తీరును తప్పు పడుతున్న వైనం ఎక్కువగా కనిపిస్తోంద్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.