Begin typing your search above and press return to search.

మోడీ మంత్రివర్గంలోకి టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:39 AM GMT
మోడీ మంత్రివర్గంలోకి టీఆర్ఎస్
X
టీఆరెస్ కు బీజేపీ నుంచి ఊహించని ఆఫరొచ్చింది. ఎన్డీఏ కూటమిలోకి చేరాలని బీజేపీ అధినాయకత్వం నుంచి ఆహ్వానం అందినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల డీజీపీల సదస్సు కోసం హైదరాబాద్‌కొచ్చిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ను మోడీ పక్కకు తీసుకెళ్లి వెరీ భుజాలపై చేయి వేసి మాట్లాడటం… అలాగే హస్తిన తిరిగి పయనమయ్యే వేళ… వీడ్కోలు చెప్పడానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో చెయ్యి వేసి మోడీ సంభాషించడం… పెద్ద నోట్ల రద్దు నిర్ణయం… తదనంతర పరిణామాలపై మాట్లాడుకున్నట్లు మీడియాలో వార్తలొచ్చినా… ఎన్డీఏ కూటమిలో చేరమని పరోక్షంగా సంకేతాలిచ్చారని తాజా సమాచారం.

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక సీఎం కేసీఆర్‌ కేంద్రంపై మరి ముఖ్యంగా ప్రధాని మోడిపై అవకాశం వచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే కేంద్రానికి దగ్గర కావాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలను సాక్షాత్తూ నరేంద్రమోడే ప్రశంసించడం బట్టి చూస్తుంటే కేంద్రం, రాష్ట్రం కలిపి పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు అవగతమవుతోంది. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ డీజీపీల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడి శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం, కేసీఆర్‌ను దూరంగా తీసుకువెళ్లి ఏకాంతంగా మంతనాలు జరిపిన పరిస్థితులను ఆధ్యయనం చేస్తే కేంద్రంతో సఖ్యతగా ఉండాలన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. నోట్ల రద్దు నుంచి కేంద్రం వెనక్కిపోయే అవకాశంలేదని కేసీఆర్‌ మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మంత్రులు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు కేంద్రానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడవద్దని, కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా మనమే మారితే బాగుంటుందని కేసీఆర్‌ చెప్పినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయాన్ని తప్పు పడుతూ కూర్చుంటే రాష్ట్ర ప్రజలు నష్టపోతారని, ప్రజల ఆలోచన విధానాన్ని కూడా మార్చవల్సి ఉంటుందని, లేని పక్షంలో వారు కూడా నష్టపోతారని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ కుమార్తె వివాహా రిసెప్షన్‌ లోనూ కేసీఆర్, దత్తాత్రేయలు ప్రత్యేకంగా గంటపాటు భేటీ అయ్యారు. టీఆరెస్ కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో కేంద్ర మంత్రివర్గంలో చేరితే బాగుంటుందనే అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేశారని, ఇదే అంశంపై రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, డి శ్రీనివాస్‌, లోక్‌సభ సభ్యులు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, వినోద్‌కుమార్‌లతో కేసీఆర్‌ సంప్రదింపులు కూడా చేశారని తెలుస్తోంది. ఎన్డీయే కూడా టీఆరెస్ పట్ల సానుకూలంగా ఉండడం.. కేసీఆర్ కూడా కేంద్రంలో చేరేందుకు ఇష్టంగానే ఉండడంతో కొత్త సంవత్సరంలో ఈ చేరిక ఉండొచ్చని భావిస్తున్నారు.