Begin typing your search above and press return to search.

కేసీఆర్ అనుకున్న‌ట్లే.. ఐదు ఎమ్మెల్సీలు కైవ‌శం!

By:  Tupaki Desk   |   12 March 2019 5:06 PM GMT
కేసీఆర్ అనుకున్న‌ట్లే.. ఐదు ఎమ్మెల్సీలు కైవ‌శం!
X
రాజ‌కీయంలో కొన్నిసార్లు అంతే.. కొంద‌రి టైం న‌డుస్తూ ఉంటుంది. వారేం అనుకుంటే అలా జ‌రిగిపోతూ ఉంటుంది. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన కాలంలో ఆయ‌న కోరుకున్న‌దే జ‌రిగేది. ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగినా.. తుది ఫ‌లితం మాత్రం వైఎస్ చెప్పిన‌ట్లే వ‌చ్చేది. వైఎస్ త‌ర్వాత రాజ‌కీయాల్ని శాసిస్తున్న నేత‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేరే చెప్పాలి. ఇప్పుడాయ‌న ఏమ‌నుకుంటే అది జ‌రిగి తీరే ప‌రిస్థితి. బ‌లం ఉందా? లేదా? అన్న‌ది ప‌క్క‌న పెట్టేస్తే.. ఆయ‌న డిసైడ్ చేసిందే జ‌రిగే ప‌రిస్థితి.

తాజాగా జ‌రిగిన తెలంగాణ ఎమ్మెల్యే కోటా మండ‌లి ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్ అనుకున్న‌ట్లే తుది ఫ‌లితం వెలువ‌డింది. ఐదో స్థానాన్ని సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ కు సొంతంగా బ‌లం లేన‌ప్ప‌టికి.. కేసీఆర్ ర‌చించిన వ్యూహానికి త‌గ్గ‌ట్లే తుది ఫ‌లితం వ‌చ్చింది.

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నాలుగు స్థానాల్ని సొంతం చేసుకోగా.. కేసీఆర్ తో ఉన్న మిత్ర‌త్వం కార‌ణంగా మ‌జ్లిస్ మ‌రో ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్ రెడ్డి.. స‌త్య‌వ‌తి రాథోడ్‌.. మ‌హ‌మూద్ అలీ.. ఎగ్గె మ‌ల్లేశం గెలుపొందారు.

ఈ రోజు ఉద‌యం జ‌రిగిన ఎమ్మెల్సీ పోలింగ్ లో టీఆర్ఎస్ కు చెందిన 91 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. మ‌జ్లిస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటేశారు. కాంగ్రెస్‌.. టీడీపీ.. బీజేపీ ఎమ్మెల్యేలు పోలింగ్‌ను బ‌హిష్క‌రించారు. దీంతో.. ద్వితీయ ప్రాధాన్య‌త ఓట్ల‌తో టీఆర్ఎస్.. మ‌జ్లిస్ ఐదు స్థానాల్ని సొంతం చేసుకుంది.