Begin typing your search above and press return to search.

బీజేపీ నేత‌ను ఘ‌నంగా స‌న్మానించిన టీఆర్ఎస్ మంత్రులు..!

By:  Tupaki Desk   |   8 July 2022 1:30 PM GMT
బీజేపీ నేత‌ను ఘ‌నంగా స‌న్మానించిన టీఆర్ఎస్ మంత్రులు..!
X
టీఆర్ఎస్ మంత్రులు ఏమిటీ..? బీజేపీ నేత‌ను ఘ‌నంగా స‌న్మానించ‌డం ఏమిటీ..? అనుకుంటున్నారా..? గ‌త రెండేళ్లుగా వీరి మ‌ధ్య వ్య‌వ‌హారం ఉప్పు నిప్పుగా మారిన త‌ర్వాత కూడా అక‌స్మాత్తుగా ఈ క‌ల‌యిక ఏమిట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఇటీవ‌లే మోదీ, బీజేపీ టీం తెలంగాణ గ‌డ్డ‌పై స‌మావేశాలు నిర్వ‌హించి.. కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా విమ‌ర్శించిన త‌ర్వాత కూడా ఈ సాన్నిహిత్యం ఏంట‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారా..?

అవునండీ ఇది నిజ‌మే. బీజేపీ నేత‌ను టీఆర్ఎస్ మంత్రులు స‌న్మానించింది వాస్త‌వ‌మే. అది ఎక్క‌డో కాదు వ‌రంగ‌ల్ జిల్లాలో. కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహం వేడుక‌ల‌లో భాగంగా ఈ స‌న్నివేశం చోటుచేసుకుంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బ‌స్త‌ర్ లో ఉంటున్న కాక‌తీయుల 22వ వార‌సుడు క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ కాక‌తీయ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. త‌మ పూర్వీకులు పాలించిన వ‌రంగ‌ల్ కోట‌లో గాలిలోకి బెలూన్లు ఎగుర‌వేసి ఉత్స‌వాల‌ను ప్రారంభించారు. అయితే.. ఈ ఉత్స‌వాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది.

మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్‌, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎంపీ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే విన‌య్ భాస్క‌ర్, న‌గ‌ర మేయ‌ర్‌, క‌లెక్ట‌ర్ ఇలా రాష్ట్ర ప్ర‌ముఖులంద‌రూ ద‌గ్గ‌రుండి ఈ వేడుక‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ కు వీరంద‌రూ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. బోనాల‌తో, డ‌ప్పు వాయిద్యాల‌తో ఆయ‌న‌ను గుర్ర‌పు బండీపై ఊరేగించి వేయిస్తంభాల గుడిలో ద‌ర్శ‌నం చేయించారు. త‌ర్వాత ఆయ‌న సాయంత్రం హైద‌రాబాద్ కు వెళ్లి మంత్రి కేటీఆర్ తో కూడా భేటీ అయ్యారు.

అయితే.. ఇక్క‌డే అస‌లైన చిక్కు వ‌చ్చి ప‌డింది. భంజ్ దేవ్ కాక‌తీయుల పూర్వీకుడైనా ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న తాత ప్ర‌వీర్ చంద్ర‌భంజ్‌, తండ్రి భ‌ర‌త్ చంద్రభంజ్ బ‌స్త‌ర్ లో ఆదివాసీ హ‌క్కుల కోసం పోరాడారు.

ప్ర‌వీర్ చంద్ర‌భంజ్ కు అక్క‌డ గుడి కూడా క‌ట్టారు.ఆదివాసీ హ‌క్కుల కోసం రాజ‌కీయ పార్టీని స్థాపించి బ‌స్త‌ర్ లో ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఆదివాసీల‌ను సాయుధులుగా మారుస్తున్నార‌ని అప్ప‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు ఆయ‌న‌ను కాల్చి చంపారు. ఆ త‌ర్వాత వీరి కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండిపోయింది.

మ‌ళ్లీ 2013లో ప్ర‌వీర్ మ‌నువ‌డు క‌మ‌ల్ చంద్ర భంజ్ దేవ్ బీజేపీలో చేరి క్రియాశీల రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. ర‌మ‌ణ్ సింగ్ ప్ర‌భుత్వం కేబినెట్ హోదా గ‌ల ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర యువ‌జ‌న క‌మిష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఇలా ఈయ‌న పూర్తి బీజేపీ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న‌కు కాక‌తీయుల హోదా ముసుగులో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న రాచ‌మ‌ర్యాద‌లు చూస్తుంటే ప్ర‌జ‌ల్లో కూడా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీతో చేస్తుంది ఉత్తుత్తి పోరాట‌మేనా అనే సందేహాలు కూడా మొద‌ల‌య్యాయి. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!