Begin typing your search above and press return to search.

ఈటల చూపు ఏ వైపు ... ఆ భేటీల ఆంతర్యమేమిటి?

By:  Tupaki Desk   |   13 May 2021 12:30 PM GMT
ఈటల చూపు ఏ వైపు ... ఆ భేటీల ఆంతర్యమేమిటి?
X
టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలతో సీఎం కేసీఆర్, ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఈటల తన భవిష్యత్ రాజకీయ వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త పార్టీ పెడతారా పెడతారా, పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌ గా బరిలో దిగి ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుతారా అన్న ప్రశ్నలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. అయితే , ఆయన మాత్రం నిమ్మలంగా నిండుకుండలా ఎటు తొనకకుండా వ్యవహరిస్తున్నారు. ఆయన రోజుకో నేతతో బేటీ అవుతూ, ప్రజా హక్కుల సంఘాల నేతలను కలుస్తూ, నియోజకవర్గ, గ్రామస్థాయి ప్రతినిధులతో చర్చలు జరుపుతూ తన ఆంతర్యం ఏమిటో బయటకి తెలియకుండా వ్యవహరిస్తున్నారు.

అయితే , ఈటల వ్యవహారాన్ని గమనిస్తున్న రాజకీయ వర్గాలు కొత్తపార్టీ పెట్టడం ఖాయమనే అభిప్రాయానికి వస్తున్నాయి. ఆయన టీఆర్‌ ఎస్‌ లో తాను ఇమడలేనని నిశ్చయించుకోవడంతోనే సీఎం పై తన నిరసన గళాన్ని పెంచుతూ వస్తున్నారని అభిప్రాయపడతున్నారు. కొత్తపార్టీ ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారని అంటున్నారు. బుధవారం ఆయన టీఆర్‌ ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ తో భేటీ అయ్యారు. అదే సమయంలో డి శ్రీనివాస్‌ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్‌ తో కూడా ఆయన విడిగా చర్చించారని తెలుస్తోంది. వారంరోజులుగా ఈటల వరుసగా కొండా విశ్వేశర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, టీఆర్‌ ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, మరో సీనియర్‌ నాయకుడు రాములు నాయక్‌ తో బేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కూడా ఆయన టచ్‌ లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డితో కూడా భేటీ కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఇక, తన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల చెప్పుకొస్తున్నారు

కాంగ్రెస్‌ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ టి జీవన్‌ రెడ్డి ఈటల రాజేందర్‌ ను గట్టిగా సమర్థిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరుపై ధ్వజమెత్తడం రాజకీయంగా రాజేందర్‌ కు కలిసి వచ్చే అంశంగా మారింది. తనకు అన్ని పార్టీ నేతలు ఫోన్లు చేసి మాట్లాడారని, తనకు ఎవరితో శత్రుత్వం లేదని, అందరూ తనకు మద్దతు క్రటించారని చెబుతూ ఆయన ఇతర పార్టీలో చేరుతారని జరుగుతున్న ప్రచారానికి తెరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టినా తన సొంత నియోజకవర్గంలో సత్తా చాటుకోవడం అత్యంత కీలకమని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో ఇతర నేతలతో చర్చిస్తూ తనకు వ్యతిరేకంగా గళం విప్పితున్న వారి గురించి ఆరా తీస్తున్నారని తెలిసింది. ఈ విషయాలపై విశ్లేషిస్తూ, జరుగుతున్న పరిణమాల ఫలితాలు ఎలా ఉంటాయోనని అంచనా వేసుకుంటున్నారని సమాచారం. ఈటల రాజేందర్‌ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టక పోయినా ఇప్పటికిప్పుడు రాజీనామా చేసే ఆలోచన మాత్రం లేదని, హుజూరాబాద్‌ లో ఉప ఎన్నికలు ఉండవనే అభిప్రాయానికి అందరూ వచ్చారు.