Begin typing your search above and press return to search.

బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక‌..!

By:  Tupaki Desk   |   16 Sep 2021 3:30 PM GMT
బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక‌..!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పార్టీని బ‌లోపేతం చేస్తున్నారా? లేక‌.. పార్టీలో ఏర్ప‌డిన నైరాశ్యాన్ని తొల‌గించే చ‌ర్య‌లు చేప‌ట్టారా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం. దీనికి కార‌ణం.. తాజాగా ఆయ‌న ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. ఇలా హుటా హుటిన నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక రీజ‌న్ లేకుండా ఉంటుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక‌, బాజిరెడ్డిని తీసుకుంటే.. ఈయ‌న‌కు ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఇవ్వడంలో ఎలాంటి అనుమానం లేదు. అన్ని అర్హ‌త‌లు ఆయ‌న‌కు ఉన్నాయి. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న నాయ‌కుడిగా గోవ‌ర్ధ‌న్ రెడ్డి గుర్తింపు పొందారు. గ‌తంలో కాంగ్రెస్‌, త‌ర్వాత‌.. వైసీపీ.. ఆ త‌ర్వాత‌.. టీఆర్ ఎస్‌లో ఆయ‌న చ‌క్రం తిప్పారు. నిజామాబాద్ నాయ‌కుల్లో ఆయ‌న ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ఉన్నారు మ‌రో ప్ర‌ధాన ప్ల‌స్‌.

ఇక‌, టీఆర్ఎస్ తరపున 2014, 2018 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు. జిల్లాలోని సీనియర్ నాయకుల్లో ఒకరిగా ఉన్న ఆయన మంత్రివర్గంలో స్థానం ఆశించారు. అయితే 2014లో జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆ తరువాత వేముల ప్రశాంత్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. అప్పటి నుంచే బాజిరెడ్డి గోవర్ధన్‌కు సీఎం కేసీఆర్ కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనకు కీలకమైన ఆర్టీసీ చైర్మన్ పదవిని అప్పగించారు.

ఇక‌, ఇప్పుడు పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెలాఖరునాటికి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. త్వరలోనే పార్టీ అధినేత కేసీఆర్ జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. దీనిని బ‌ట్టి.. పార్టీని ప‌టిష్టం చేయ‌డంపై దృష్టి పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అయితే.. సీనియ‌ర్ల‌కు ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌కుండానే తాను జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని భావించిన కేసీఆర్‌.. ఆదిశ‌గా నే చ‌ర్య‌లు చేప‌ట్టార‌నేది విశ్లేష‌కుల మాట‌. చాలా కాలం నుంచి పెండింగ్‌‌లో పార్టీ నామినేటెడ్ పదవులపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు. అయితే వీటిని పెండింగ్‌లో పెడుతూ వస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు త్వరలోనే నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు కూడా పదవులు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారని సమాచారం. దీంతో మిగతా ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే నామినేటెడ్ పదవులు దక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది.అయితే.. ఇదంతా బీజేపీ దూకుడు ను క‌ట్ట‌డి చేయ‌డంలో భాగ‌మై ఉంటుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏదైతేనేం.. సీనియ‌ర్ల‌కు ప‌ద‌వులు ద‌క్కుతున్నాయి క‌దా.. అంటున్నారు.