Begin typing your search above and press return to search.

గులాబీ అభ్య‌ర్థుల‌కు పోలీసు సాయం కావాల‌ట‌!

By:  Tupaki Desk   |   23 Oct 2018 6:29 AM GMT
గులాబీ అభ్య‌ర్థుల‌కు పోలీసు సాయం కావాల‌ట‌!
X
ఎలాంటి ముంద‌స్తు షెడ్యూల్ లేకుండానే బ‌రిలోకి దిగిన గులాబీ అభ్య‌ర్థుల‌తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కావ‌టం తెలిసిందే. ఎప్ప‌టి మాదిరే.. తాను మీటింగ్ పెట్టానంటే సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపే కేసీఆర్ తీరుకుత‌గ్గ‌ట్లే.. ఈ మీటింగ్ కూడా కాసింత ఎక్కువ సేపే సాగింది.

ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ప‌లువురు అధినేత దృష్టికి తీసుకెళ్లిన రిక్వెస్ట్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రీ ముఖ్యంగా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ అభ్య‌ర్థుల రిక్వెస్ట్ లు అయితే ఒక రేంజ్లో ఉండ‌ట‌మే కాదు.. కేసీఆర్‌కు కొత్త ఆలోచ‌న‌ల్లో ప‌డేసేలా ఉన్నాయ‌ని చెబుతున్నారు.
త‌మ‌కు పోలీసుల ర‌క్ష‌ణ మ‌రింత పెంచాల‌న్న‌ది టీఆర్ఎస్ అభ్య‌ర్థుల తాజా రిక్వెస్ట్ గా చెబుతున్నారు. ఎందుకిలా అన్న ప్ర‌శ్న‌కు వారిచ్చ స‌మాధానం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తాము గ్రామాల్లోకి వెళుతుంటే.. కొంద‌రి నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మువుతున్న‌ట్లు చెబుతున్నారు. వారి నుంచి ఎదుర‌వుతున్న ఇబ్బందుల్ని అధిమించేందుకు వీలుగా పోలీసు సెక్యురిటీని మ‌రింత పెంచాల‌న్న రిక్వెస్ట్ వారి నుంచి వ‌స్తోంది.

ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో న‌ల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప‌లువురు.. ఆ మాట‌కు వ‌స్తే చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో ప‌ర్య‌టించింది.. అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకున్న‌ది లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా త‌మ దారిన తాము ఉండ‌టం.. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల మీద దృష్టి పెట్టారే కానీ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద పెద్ద‌గా ఫోక‌స్ చేసింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో భాగంగా వెళుతున్న టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ప‌లు గ్రామాల్లోని ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. తాను చేయించిన స‌ర్వేల్లో భారీ మెజార్టీతో పార్టీ గెలుస్తుంద‌న్న అంచ‌నాలు చెబుతున్న కేసీఆర్ మాట‌ల‌కు భిన్నంగా గ్రౌండ్లో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌టం ఇప్పుడు పార్టీలో ఇప్పుడో పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

నేత‌లు పోలీసు ర‌క్ష‌ణ కోర‌టం మామూలే. మావోల నుంచి ర‌క్ష‌ణ కోసం కోరుతుంటారు కానీ సామాన్య ప్ర‌జ‌ల నుంచి వెల్లువెత్తే వ్య‌తిరేక‌త నుంచి త‌మ‌ను తాము రక్షించుకోవ‌టం కోసం సెక్యురిటీని మ‌రింత పెంచాల‌న్న అభ్య‌ర్థుల‌ రిక్వెస్ట్ కేసీఆర్ కు షాకింగ్ గా మారిన‌ట్లు చెబుతున్నారు.