Begin typing your search above and press return to search.

వ్యాపారిని కొట్టేసిన గులాబీ ఎమ్మెల్యే?

By:  Tupaki Desk   |   12 Dec 2017 6:11 AM GMT
వ్యాపారిని కొట్టేసిన గులాబీ ఎమ్మెల్యే?
X
తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నిన్న‌కాక మొన్న‌నే స‌స్పెండ్ అయిన అధికారికి రీపోస్టింగ్ ఇవ్వాలంటూ వార్నింగ్ ఇచ్చిన అధికార‌ప‌క్ష ఎమ్మెల్యే ర‌చ్చ స‌మ‌సిపోక ముందే.. మ‌రో వివాదం తెర మీద‌కు వ‌చ్చింది.

వ‌రంగ‌ల్ గ్రామీణ జిల్లా ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఒక వ్యాపారిని చేయి చేసుకున్న వైనం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒక క్ర‌ష‌ర్ వ్యాపారిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్న వైనం ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ల‌టం.. అక్క‌డ నుంచి వ‌చ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

మొత్తం స‌మాచారాన్ని సేక‌రించారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం శాయంపేట మండ‌లంలో ప‌లు క్ర‌ష‌ర్ లు ఉన్నాయి.

ఇక్క‌డ జ‌రిగే అక్ర‌మ పేలుళ్ల కార‌ణంగా న‌స్టం వాటిల్లుతోంది. దీంతో.. వీటిని మూసివేయాలంటూ ఆందోళ‌నలు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ రంగంలోకి దిగి క్ర‌ష‌ర్ల‌ను మూసివేయించారు. దీనిపై గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఇక్క‌డే అస‌లు ర‌చ్చ మొద‌లైంది.

న‌ష్టం వాటిల్లేలా చేస్తున్న క్ర‌ష‌ర్ల‌ను అధికారులు మూసివేసినా.. ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డికి చెందిన క్ర‌ష‌ర్‌ ను మాత్రం మూసివేయ‌లేదు. దీంతో జిల్లాకు చెందిన ఒక క్ర‌ష‌ర్ వ్యాపారి త‌మ అంద‌రి వ్యాపారాలు మూయించేసి.. ఎమ్మెల్యే క్ర‌ష‌ర్ న‌డ‌ప‌టం అన్యాయ‌మ‌ని.. ఒక క్ర‌ష‌ర్ వ్యాపారి గ‌ళం విప్పారు.ఈ విష‌యం ఎమ్మెల్యేకు తెలిసి ఆగ్ర‌హానికి గురైన‌ట్లు చెబుతున్నారు.

ఈ ఉదంతంపై మాట్లాడాలంటూ గ‌త నెల 30న హ‌న్ముకొండ‌లోని త‌న ఇంట్లో చ‌ర్చ‌ల పేరుతో పిలిచి.. మాట‌ల మ‌ధ్య‌లో వ్యాపారి చెంప మీద ఛెళ్లున కొట్టిన‌ట్లుగా చెబుతున్నారు. దీన్ని అడ్డుకోబోయిన మాజీ ఎమ్మెల్యే బ్ర‌ద‌ర్ మీద కూడా చేయి చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎమ్మెల్యే అనుచ‌రులు కూడా దాడికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

దీనిపై వ్యాపార వ‌ర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారంపై స‌మాచారం అందుకున్న సీఎం కేసీఆర్ నిఘా వ‌ర్గాల‌ను అలెర్ట్ చేయ‌టం.. అస‌లేం జ‌రిగంద‌న్న విష‌యాన్ని గ్రౌండ్ రిపోర్ట్ త‌న‌కు ఇవ్వాల‌ని ఆదేశించారు. దీంతో.. బాధిత వ్యాపారుల వ‌ద్ద‌కు వ‌చ్చిన నిఘా వ‌ర్గాలు జ‌రిగిన విష‌యాన్ని తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే తొలుత ఎమ్మెల్యేకు.. త‌ర్వాతి కాలంలో పార్టీ మీద కూడా చెడ్డపేరు రావ‌టం ఖాయ‌మంటున్నారు. ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి మాత్రం తాను ఎవ‌రిని కొట్ట‌లేద‌ని.. త‌న‌ను దెబ్బ తీయ‌టానికే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లుగా ఎమ్మెల్యే చెబుతున్నారు.