Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఎమ్మెల్యేకి తెరాస ఎమ్మెల్యే చెంపదెబ్బ
By: Tupaki Desk | 4 Sep 2015 12:09 PM GMTమహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసగా సాగింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ముందుగా టీడీపీ సభ్యులు పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టీడీపీ నాయకులకు సిగ్గుశరం లేదని విమర్శించడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది.
తర్వాత కాంగ్రెస్ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేయడంతో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ వివాదం పెరిగి పెద్దదవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమనోహర్ రెడ్డిని తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లాగి చెంపదెబ్బ కొట్టారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలోనే ఇదంతా జరిగింది.
ఈ సంఘటనపై డీకే అరుణ మాట్లాడుతూ గువ్వల బాలరాజుకు చేయిచేసుకోవడం కొత్తేం కాదని గతంలో ఆయన సామాన్యులపై చేయి చేసుకున్నాడని..ఇటీవల పెన్షన్ అడిగినందుకు ఓ వికలాంగుడిని కూడా కొట్టాడని విమర్శించారు. ఆయన ఎవ్వరి మాట వినకుండా..ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వినాలన్నంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇక తెరాస ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై దాడులకు కూడా దిగుతోందని..ఈ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణలేదని ఆమె ధ్వజమెత్తారు.
తర్వాత కాంగ్రెస్ నాయకులు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లడుతూ రామ్మోహన్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించారని...ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. జడ్పీ చైర్మన్ పోడియం వద్ద బైఠాయించి రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.