Begin typing your search above and press return to search.

ఎంపీ అరవింద్ గ్రామాల్లోకి వెళ్లలేడా ఇక.?

By:  Tupaki Desk   |   16 March 2021 8:25 AM GMT
ఎంపీ అరవింద్ గ్రామాల్లోకి వెళ్లలేడా ఇక.?
X
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ మెడకు ‘పసుపు ఉచ్చు’ బిగుసుకుంటోంది. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలవడానికి ఉపయోగించుకున్న ‘పసుపు బోర్డు’యే ఇప్పుడు ఆయన మెడకు బిగుసుకుంటోంది. కేసీఆర్ కూతురు కవితను ‘పసుపు బోర్డు’ తెస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మరీ గెలిచిన అరవింద్ ఇప్పుడు గెలిచి రెండేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తకపోవడం.. తాజాగా కేంద్రంలోని బీజేపీ పసుపు బోర్డు కష్టమని ప్రకటించడంతో ఆయన ఇరుకునపడ్డారు. ఎంపీగా గెలిచిన వారం లోపే తెస్తానని మాట ఇచ్చిన అరవింద్ ఇప్పటికే ఆ మాట తప్పి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా పసుపు బోర్డు ఇక సాధ్యం కాదని స్వయంగా కేంద్రంలోని బీజేపీ తేల్చడంతో అరవింద్ కార్నర్ అయ్యాడు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పసుపు బోర్డు ఏమైందో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పాలని టీఆర్ఎస్ స్వరం అందుకుంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ లేవనెత్తారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా తెలుపడంతో ఎన్నికల సమయంలో బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని చెప్పి ఎంపీ అరవింద్ ఇప్పుడు ఆ పనిచేసి ఉద్యమానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డుపై మాట్లాడాలన్నారు.

బీజేపీ అంటే అబద్ధాల పార్టీ అని.. అమ్మకం పార్టీగా మారిందని జీవన్ రెడ్డి విమర్శించాడు. ప్రతిరోజు ఏదో ఒక సంస్థను బీజేపీ అమ్ముతోందని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ను ఇక తిరగనీయమని.. అడ్డుకుంటామని తెలిపారు.

కేంద్రమే స్పష్టం చేయడంతో ఇక ఎంపీ అరవింద్ నిజామాబాద్ పరిధిలోని గ్రామాల్లో తిరగని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆయన ఏం చేస్తారు? ఎలా అడుగులు వేస్తారన్నది ఆసక్తిగా మారింది.