Begin typing your search above and press return to search.

ప్ర‌జా స‌మ‌స్య‌లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న ప్ర‌యోగం...!

By:  Tupaki Desk   |   9 Jan 2022 1:30 AM GMT
ప్ర‌జా స‌మ‌స్య‌లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న ప్ర‌యోగం...!
X
ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని వాటిని ప‌రిష్క‌రించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక‌పై ప్ర‌జ‌లు తాము ఉన్న చోట నుంచే త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్రస్తావించి ప‌రిష్క‌రించుకునే విధంగా నూత‌న యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది క‌నుక విజ‌య‌వంతం అయితే తెలంగాణ‌లోనే తొలి వినూత్న ప్ర‌యోగంగా నిలిచిపోతుంద‌ని పార్టీ శ్రేణులు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం శుక్ర‌వారం ప్ర‌జాబంధు పేరుతో ఒక కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్క‌రించారు. టెక్నాల‌జీని వాడుకొని త‌న టీంతో ఈ యాప్‌ను స్వ‌యంగా రూపొందించారు. ప‌ల్లెల్లో, గ్రామాల్లో, ప‌ట్ట‌ణంలో ఏ స‌మ‌స్య ఉన్నా ప్ర‌జ‌లు స్వ‌యంగా మండ‌ల కేంద్రాల్లో ఉన్న అధికారులను క‌లిసి విన్న‌వించుకునే ప‌రిస్థితి ఇప్ప‌టి వ‌ర‌కు ఉండేది. ఈ యాప్ ద్వారా ఇక‌పై ఆ అవ‌స‌రం ఉండ‌బోదు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ మొబైల్ ద్వారానే త‌మ స‌మ‌స్య‌ల‌ను చేర‌వేయ‌వ‌చ్చు.

ప్రజాబంధు యాప్ ద్వారా ప్ర‌జ‌లు ఇక‌పై నేరుగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వారి స‌మ‌స్య‌లను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఆ స‌మ‌స్య‌లు వారి దృష్టికి వెళ్లాయా.. లేదా అనేది కూడా యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఆ స‌మ‌స్య‌ను ఆ అధికారి ఎప్పుడు ప‌రిష్క‌రిస్తారు.. ఎంత స‌మ‌యం ప‌డుతుంది.. లాంటి వివ‌రాలు కూడా యాప్‌లో న‌మోదు చేయ‌బ‌డ‌తాయి. ఏదైనా ఫిర్యాదును అధికారులు తిర‌స్క‌రిస్తే అందుకు కార‌ణాల‌ను కూడా అందులో వివ‌రిస్తారు. మొత్తంమీద మ‌నం కాలు క‌దిపే ప‌ని లేకుండానే ప‌నులు పూర్త‌వుతాయ‌న్న‌మాట‌.

ఈ విధంగా రోహిత్ రెడ్డి వినూత్న ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌తి వ్య‌క్తి చేతిలోని స్మార్ట్ ఫోన్ను స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార వేదిక‌గా చూపించారు. అన్ని శాఖ‌ల అధికారుల‌ను ఇందులో భాగ‌స్వామ్యులుగా చేస్తున్నారు. ప్ర‌జాబంధు యాప్ ప‌నితీరును అధికారుల‌కు వివ‌రించి వారి ఫోన్ల‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ యాప్ ను త్వ‌ర‌లో ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జాబంధు యాప్ స‌క్ర‌మంగా ప‌నిచేసేందుకు అటు ప్ర‌జ‌ల‌కు.. ఇటు అధికారుల‌కు మ‌ధ్య వార‌ధులుగా ఎమ్మెల్యే త‌న సొంత టీంను వ‌లంటీర్లుగా ప్ర‌క‌టించారు. ఇలా ఒక కొత్త కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల మ‌న‌సు చూర‌గొంటున్న రోహిత్ రెడ్డిని అంద‌రూ అభినందిస్తున్నారు.