Begin typing your search above and press return to search.

దుబ్బాక తెరాస ఎమ్మెల్యే రామ‌లింగా రెడ్డి మృతి

By:  Tupaki Desk   |   6 Aug 2020 3:04 AM GMT
దుబ్బాక తెరాస ఎమ్మెల్యే రామ‌లింగా రెడ్డి మృతి
X
తెరాస దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యానికి చికిత్స పొందుతున్న ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం పార్టీలో కార్య‌క‌ర్త‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ప్ర‌జ‌ల మ‌నిషిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి గ‌త కొంత‌కాలంగా హైదరాబాద్ ‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రామ‌లింగారెడ్డికి భార్య.. కూతురు.. కొడుకు ఉన్నారు. రాజ‌కీయాల్లో విజేత‌గా ఆయ‌న చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే .. 2001 నుంచి ఆయ‌న తెరాస పార్టీలో కొన‌సాగుతున్నారు. కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004- 2008- 2014- 2019 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌జ‌ల మ‌న్న‌న పొందారు.

రాజకీయ నేత కాక మునుపు సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసిన అనుభ‌వం ఆయ‌న సొంతం. 2004లో సీఎం కేసీఆర్ దృష్టిలో పడ‌టానికి కార‌ణం జ‌ర్న‌లిస్టుగా ఆయ‌న చేసిన కృషి.. ప్ర‌జా సేవాత‌త్ప‌ర‌త అనే చెబుతారు. ఆయ‌న‌లో ని ఉద్య‌మ స్ఫూర్తి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్ని గ‌మ‌నించి కేసీఆర్ రాజ‌కీయాల్లోకి ఆహ్వానించారు. రాజ‌కీయాల్లో మెజారిటీ ప్ర‌జానీకానికి సేవ చేసే అవ‌కాశం క‌లుగుతుంద‌నే ఆయ‌న ఈ రంగంలో అడుగుపెట్టారు.

ఆయ‌న కాలికి గాయం కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నార‌ని అయితే స‌డెన్ గా గుండె నొప్పి రావ‌డంతో మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది. అయితే ఆయ‌న‌కు క‌రోనా అని సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నుండి రామలింగ రెడ్డి పార్థివ దేహం దుబ్బాక కు తరలించారు. స్వగ్రామం చిట్టపుర్ లో ప్రభుత్వ లాంచనాలతో అంతక్రియలు జరగనున్నాయి.