Begin typing your search above and press return to search.

వ‌చ్చే 20 ఏళ్ల‌లో కేటీఆరే ప్ర‌ధాన మంత్రి.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 Sep 2021 3:30 AM GMT
వ‌చ్చే 20 ఏళ్ల‌లో కేటీఆరే ప్ర‌ధాన మంత్రి.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల స్వామి భ‌క్తి ప‌రాకాష్ఠ‌కు చేరింది. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్ , సీఎం కేసీఆర్‌ల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డ‌మే కాదు.. వారిని ఆకాశానికి మోసేస్తున్న నాయ‌కుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆర్మూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ. జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత మంత్రి, సీఎం త‌న‌యుడు కేటీఆర్‌.. ఈ దేశానికి కాబోయే ప్ర‌ధాన మంత్రి అంటూ.. ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు.. కేటీఆర్ ఎప్పుడు ప్ర‌ధాని అవుతారో కూడా చెప్పేశారు. ``వ‌చ్చే20- 30 ఏళ్ల‌లో కేటీఆర్ ఈ దేశానికి ప్ర‌ధాని అవుతారు`` అని ఆయ‌న వ్యాఖ్‌యానించారు.

అది కూడా ఏ మార‌మూల స‌భ‌లోనో.. లేదా ప్రెస్‌మీటో పెట్టి చెప్ప‌లేదు. ఏకంగా ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ అసెంబ్లీలోనే ఆయ‌న వ్యాఖ్యానించారు. కేటీఆర్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత‌.. ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగం, హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది స‌రైన విధానం కాద‌ని.. ప్ర‌తిప‌క్ష నేత‌ల వ్యాఖ్య‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉన్న మంచి పేరు నాశ‌నం అవుతోంద‌ని.. ఇక నుంచైనా స‌భ్యులు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న కోరారు. అంతేకాదు.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రం.. పెట్టుబ‌డుల‌కు కేంద్రంగా మారుతున్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

అనంత‌రం స్పీక‌ర్ అనుమ‌తితో మైకు అందుకున్న ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. మంత్రికేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. కేటీఆర్ అసెంబ్లీలో ఏక‌ధాటిగా రెండు గంట‌లు మాట్లాడిన తీరు అద్భుత మ‌ని కొనియాడారు. ఈ విష‌యాన్ని జాతీయ పార్టీలు(బీజేపీ, కాంగ్రెస్‌) అస్స‌లు ఊహించి కూడా ఉండ‌వ‌న్నారు. కేటీఆర్ అంటే.. ఈ రెండు పార్టీల‌కూ అసూయ‌ని విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. ఆయ‌న ఎక్క‌డ ప్ర‌ధాని అయిపోతారో అని వీరికి భ‌య‌మ‌ని, ఆవేద‌న అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే 20 లేదా 30 ఏళ్ల‌లో కేటీఆర్ ఈదేశానికి ప్ర‌ధాని అవుతారని అన్నారు. అందుకే ఈ పార్టీలు ఆయ‌న‌ను టార్గెట్ చేస్తున్నాయ‌ని అన్నారు.

అంతేకాదు.. నిరుద్యోగం విష‌యంలో కాంగ్రెస్‌, బీజేపీలు అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు  బండి సంజ‌య్‌ను జీవ‌న్‌రెడ్డి టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న చేస్తున్న ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర వ‌ల్ల ఎవ‌రికి ఉప‌యోగ‌మ‌ని ప్ర‌శ్నించారు. ఇదంతా వృథా ప్ర‌యాసేన‌ని అన్నారు.

బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిరోజూ పది ప్రశ్నలు సంధిస్తున్నారని తెలిపారు. ''ప్రధాని మోదీ దేశానికి, తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి చెప్పాలని తెలిపారు. సంజయ్‌కు నేను తొమ్మిది ప్రశ్నలు సంధిస్తున్నా. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరో డ్రామాకు తెరలేపుతున్నారు. రేవంత్‌ది నిరుద్యోగ సైరన్ కాదు.. కలెక్షన్ సైరన్'' జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

అయితే.. జీవ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న చెప్పిన‌ట్టు కేటీఆర్ ప్రధాని అవుతారా?  ఆ విధ‌మైన చ‌రిష్మా ఆయ‌న‌కు ఉందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో. ఏదేమైనా.. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్‌ను, కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న నేత‌ల సంఖ్య అధికార పార్టీలో పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.