Begin typing your search above and press return to search.

కారు నడుపుతూ హైదరాబాద్ కు వచ్చిన గులాబీ ఎమ్మెల్యే.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   15 Jun 2020 7:50 AM GMT
కారు నడుపుతూ హైదరాబాద్ కు వచ్చిన గులాబీ ఎమ్మెల్యే.. ఎందుకంటే?
X
ఆ మధ్య వరకు దేశంలోనే అతి తక్కువగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు.. వైద్యులకు.. పోలీసులకు.. జర్నలిస్టులు బాధితులుగా మారుతున్నారు. తాజాగా నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్ గా తేలటంతో ఆయన. హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు.

ఇటీవల పాజిటివ్ గా తేలిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఐదు రోజుల క్రితమే బాజిరెడ్డి కలిసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల ఆయన ఒంట్లో తేడాగా అనిపించటంలో నిర్దారణ పరీక్ష చేయించుకున్నారు. ఆయనతో పాటు.. ఆయన సతీమణి కూడా చేయించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆయనకు పాజిటివ్ గా తేలగా.. ఆయన సతీమణికి నెగిటివ్ గా తేలింది.

దీంతో.. ఆసుపత్రిలో చికిత్స కోసం ఆయన హైదరాబాద్ కు ఒంటరిగా కారులో బయలుదేరారు. తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ నగరానికి చేరుకోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. శనివారం కూడా తన నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బాజిరెడ్డి కారణంగా.. ఇప్పటివరకూ ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెన్షన్ పడుతున్నారు.

ఇటీవల ఆయన పాల్గొన్న కార్యక్రమానికి ఆయనతో పాటుగా హాజరైన ఎమ్మెల్సీ వీజీ గౌడ్.. ఎమ్మెల్యే కుమారుడు.. పలు మండలాలకు చెందిన ఎంపీపీలు.. మండల స్థాయి అధికారులు పలువురు ఉన్నారు. ఒక అంచనా ప్రకారం దాదాపు వందకు పైనే ఆయన వెంట ఉన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే.. బాజిరెడ్డి పుణ్యమా అని రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో మాయదారి రోగాన పడే వారి సంఖ్య ఎక్కువే ఉంటుందని అనుమానిస్తున్నారు.