Begin typing your search above and press return to search.

కొచ్చి...బిగ్ క్వశ్చన్... ఎమ్మెల్యే కొనుగోలులో కేరళ లింకులు ..?

By:  Tupaki Desk   |   15 Nov 2022 1:30 PM GMT
కొచ్చి...బిగ్ క్వశ్చన్... ఎమ్మెల్యే కొనుగోలులో  కేరళ  లింకులు ..?
X
ఎక్కడో తీగ లాగితే మరెక్కడో డొంక కదులుతోంది. టీయారెస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తెలుగు రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు పుట్టించింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనక చాలా కీలకమైన అంశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే డొంక చాలా పెద్దది అని కూడా విచారణలో  తేలుతున్న విషయం.

ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం మీద ప్రత్యేక దర్యాప్తు కమిటీ చేస్తున్న విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కేరళలోని కొచ్చిలో దీనికి లింకులు ఉన్నాట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మొత్తం కధ మొదలైంది అక్కడ నుంచే అని అంటున్నారు.

దీంతో ఇపుడు కేరళ రాష్ట్ర పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ దర్యాప్తులో కొత్తగా కేరళ రాష్ట్రానికి చెందిన డాక్టర్ జగ్గు పేరు ప్రముఖంగా ముందుకు వస్తోంది అని అంటున్నారు. మరో వైపు ఇదే కేసుకు సంబంధించి ఏపీలోని ఎలూరుకు చెందిన ఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది అని అంటున్నారు.

ఈ కేసులో తెర ముందున్న వారు పాత్రధారులుగా ఉన్న రామచంద్ర భారతి, అలగే సింహయాజీ నందకుమార్ ఇళ్ళూ ఆఫీసులతో పాటు ఒకేసారి నాలుగు రాష్ట్రాలలో డౌట్ ఉన్న చోట్ల కూడా విచారణ జరుపుతున్నారు.

ఏ మాత్రం లేట్ అయినా ఈ కేసులో కీలకమైన ఆధారాలు అన్నీ లేకుండా పోతాయని సిట్ తొందరపడుతోంది. ఇంకో వైపు చూస్తే నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆద్వర్యంలో కేరళలో ఒక కీలకమైన బృందం పెద్ద ఎత్తున ఈ కేసు విషయం మీద తనిఖీలు చేపడుతోంది అని అంటున్నారు.

ఇదే కేసులో కేరళాకు చెందిన వడయార్ లో రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన బీజేపీ నేత తుషార్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. రామచంద్ర భారతికి తుషార్ కి సంబంధం ఏంటి అంటే కేరళకు చెందిన ఒక డాక్టర్ ఈ ఇద్దరికీ కలిపారు అని అంటున్నారు. ఆయనే డాక్టర్ జగ్గూ అని సిట్ అనుమానిస్తోంది.

దీంతో కేరళ లోనే సిట్ బృందం ఒకటి ఉంటూ మరింతగా ఈ కేసులో కూపీ లాగేందుకు చూస్తోంది అని అంటున్నారు.  మరో వైపు చూస్తే తెలంగాణా  స్టేట్ ని అస్థిరపరచడానికి కేరళలో ఎందుకు స్కెచ్ గీసారు అన్నది కూడా పరిశోధిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా గురించి అదుపులోకి తీసుకున్న వారిని అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు.

ఒకటి రెండు రోజులలో అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే పీడీ యాక్ట్ కింద కూడా నందకుమార్ లాంటి వారి మీద చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి చూస్తే ఒక విషయం స్పష్టం. తీగ లాగుతున్న కొద్దీ చాలా కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఇంకా ఎందరు తెర వెనక ఉన్నారో అన్న దాని మీద సిట్ సీరియస్ గానే సెర్చ్ చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.