Begin typing your search above and press return to search.

తెలంగాణలో టాప్ టెన్ ఎమ్మెల్యేలు వీరే..

By:  Tupaki Desk   |   28 May 2017 6:45 AM GMT
తెలంగాణలో టాప్ టెన్ ఎమ్మెల్యేలు వీరే..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ నెంబర్‌ వన్‌ గా నిలిచారు. ఆయన నిర్వహించిన సొంత సర్వేలో కేసీఆర్ మరోసారి బాహుబలిగా నిలిచారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌ ప్రజలు ఆయనకు సంపూర్ణమద్దతు ప్రకటించారు. రికార్డు స్థాయిలో 98శాతం ప్రజలు కెసిఆర్‌ నాయకత్వానికి జేజేలు పలికారు.

కాగా ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ఆయన తనయుడు కెటిఆర్‌ నిలిచారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు 92.4శాతం మంది కల్వకుంట్ల తారక రామారావు నాయకత్వానికే మద్దతు ప్రకటించారు. సిద్దిపేట ప్రజలు మంత్రి హరీష్‌ రావుకు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. 88శాతం మంది మంత్రి హరీష్‌ కు మద్దతుగా నిలిచారు. ఇక స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రజామద్దతు అనూహ్యంగా పెంచుకుని టాప్‌ ఫైవ్‌ లో నిలిచారు. నల్లగొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్‌ కుమార్‌ నాయక్‌ టాపర్‌ గా నిలవగా, ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మల్‌ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌ రెడ్డి, ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ - హైదరాబాద్‌ లో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శాయన్న, మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌ ఎమ్మెల్యే కెసిఆర్‌ - కరీంనగర్‌ లో కెటిఆర్‌ తర్వాత రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణలు అగ్రస్థానాల్లో నిలిచారు.

గత సర్వేతో పోలిస్తే మంత్రుల సామర్ధ్యం మెరుగుపడింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత సర్వే కంటే మంచి మార్కులు తెచ్చుకోగా, పార్టీ పరిస్థితి కంటే వ్యక్తిగతంగా తుమ్మలను కోరుకునే నియోజకవర్గ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. మరోవైపు సర్వేలో 80శాతంకు పైగా మార్కులు సాధించిన ఎమ్మెల్యేలు 9మంది ఉండగా, 60శాతంకు పైగా మార్కులు సాధించిన వారు 76మంది ఉన్నట్లు సిఎం వెల్లడించారు.

గత సర్వే ఫలితాల్లో పూర్వ కరీంనగర్‌ జిల్లా మంధని ఎమ్మెల్యే పుట్టామధు అట్టడుగున ఉండగా, ఈసారి పరిస్థితి కొంత మెరుగు పరుచుకున్నారు. గత సర్వేలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెంబర్‌ వన్‌ గా నిలిచిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెనక్కు వెళ్ళారు. వెనుక ఉన్న వైరా ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ ప్రధమ స్థానానికి వచ్చారు. ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అపుడూ.. ఇపుడూ రెండో స్థానంలోనే నిలవడం విశేషం. ఇక హైదరాబాద్‌ నగరానికి సంబంధించి కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు 33శాతం ప్రజల మద్దతే ఉన్నట్లు నివేదికలో స్పష్టం చేయగా, ఆయన మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. గత సర్వేలోనూ ఆయనకు తక్కువ మార్కులే రాగా, ఎంత కష్టపడ్డా సర్వేలో తక్కువగా వచ్చిందన్న ఆందోళనలో ఆయన ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సర్వే ఫలితాలను పరిశీలిస్తే వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అట్టడుగున నిలిచారు. అక్కడ పార్టీకి 65శాతం ప్రజల మద్దతు ఉన్నా.. ఎమ్మెల్యేకు మాత్రం ప్రజల మద్దతు లేదని సర్వేలో స్పష్టమైంది. కేవలం 36.2శాతం ప్రజలు మాత్రమే ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్‌ కు 92.4శాతం ప్రజలు మద్దతు ప్రకటించగా, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ కు 73.2శాతం ప్రజలు మద్దతు ప్రకటించారు.

టాప్ టెన్ ఎమ్మెల్యేలు వీరే..

ఎమ్మెల్యే పేరు నియోజకవర్గం మద్దతు శాతం
కె.చంద్రశేఖరరావు గజ్వేల్‌ 98
కె.తారకరామారావు సిరిసిల్ల 92.4
తన్నీరు హరీష్‌ రావు సిద్దిపేట 88
తాటికొండ రాజయ్య స్టేషన్‌ ఘన్‌ పూర్‌ 86
సాయన్న కంటోన్మెంట్‌ 84
ఎస్‌.సత్యనారాయణ రామగుండం 82.8
రవీంద్రకుమార్‌ నాయక్‌ దేవరకొండ 81.2