Begin typing your search above and press return to search.

ఈ కన్నీళ్లు కారును కాల్చేస్తాయేమో కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   16 Oct 2018 6:19 AM GMT
ఈ కన్నీళ్లు కారును కాల్చేస్తాయేమో కేసీఆర్‌?
X
జాత‌కాలు చూసుకొని.. ముహుర్తాలు ఒక‌టికి రెండు మార్లు చెక్ చేసుకొని.. గ్ర‌హాలు.. న‌క్ష‌త్రాలు అన్ని త‌మ‌కు అనుకూలంగా ఉన్న వేళ అసెంబ్లీ ర‌ద్దుకు చిట్టి ఇచ్చిన త‌ర్వాత‌.. ఎలాంటి ప‌రిస్థితులు ఉండాలి? నేష‌న‌ల్ హైవే మీద వెళ్లే వాహ‌నం ఎలాంటి కుదుపులు లేకుండా ఎంచ‌క్కా దూసుకెళుతుందో అంతే స్పీడుగా గులాబీ కారు ఎన్నిక‌ల రేసులో దూసుకెళ్లాలి క‌దా? కానీ.. మ‌ధ్య మ‌ధ్య‌లో ప్ర‌తిప‌క్షాల లొల్లి.. సొంత ప‌క్షంలో నిర‌స‌న‌లు.. ఇవి చాల‌వ‌న్న‌ట్లు రాములు నాయ‌క్ లాంటోళ్ల క‌న్నీళ్లు. త‌న‌కు మించిన మొన‌గాళ్లు.. మ‌గాళ్లు యావ‌త్ తెలంగాణ‌లోనే లేరంటూ సారు అంత పెద్ద గొంతేసుకొని అంటే సంబ‌రంగా చ‌ప్ప‌ట్లు కొట్టాల్సింది పోయి..ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి కావ‌టం ఏమిటి?.. ఎందుకీ దుస్థితి అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తాజాగా ఎమ్మెల్సీ రాములు నాయ‌క్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన వైనం పై ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. సారూ.. మీకు గుర్తుందో లేదో.. 2009లో టీఆర్ఎస్ ఓట‌మి పాలైన‌ప్పుడు పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేస్తే.. తానే ఆయ‌న‌కు ధైర్యం చెప్పిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

అంద‌రూ తిడుతున్న స‌మ‌యంలో తాను అండ‌గా ఉన్నాన‌ని.. అలాంటి త‌న‌ను సస్పెండ్ చేస్తారా? అంటూ విల‌విల‌లాడిపోతూ.. వ‌లవ‌ల క‌న్నీళ్లు కార్చేశారు. గ‌జ్వేల్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోసం ప‌ని చేసినందుకు స‌స్పెన్ష‌న్ బ‌హుమానాన్ని ఇచ్చారా? అంటూ వేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్న రాములునాయ‌క్.. వ‌రుస‌గా నాలుగుసార్లు టికెట్ ఇవ్వ‌కున్నా పార్టీని వీడ‌లేద‌న్నారు. అలాంటి త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌టాన్ని ప్ర‌శ్నించారు. త‌న‌కు గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల పెంపే ముఖ్య‌మ‌ని.. తాను ఏ పార్టీకి క‌ట్టుబ‌డి ఉండే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. త‌న‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతాన‌ని చెబితే తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఏ పార్టీ త‌ర‌ఫునా పోటీ చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేద‌ని.. ఉద్య‌మ‌కారుల‌కు గౌర‌వం లేద‌ని.. ఆ పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా మారిపోయింద‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ కేబినెట్ లో ఉద్య‌మ‌ద్రోహులు.. తెలంగాణ‌వాదుల‌ను త‌రిమికొట్టిన వాళ్లు.. క‌సీఆర్ ను తిట్టిన‌వాళ్లు కూడా మంత్రులు అయ్యార‌న్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్ కోసం గాంధీభ‌వ‌న్ చుట్టూ తిరిగి వాళ్ల పేరు మీద త‌న‌ను స‌స్పెండ్ చేయించ‌టంపై రాములు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ స్వ‌యంగా స‌స్పెండ్ చేస్తే తాను గ‌ర్వంగా ఫీల‌య్యే వాడిన‌ని.. ఉద్య‌మ ద్రోహితో త‌న‌ను స‌స్పెండ్ చేయిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు బీజేపీ అధినేత అమిత్ షాతో ర‌హ‌స్యంగా మంత‌నాలు జ‌రిపితే ఎందుకు స‌స్పెండ్ చేయ‌ర‌ని నిల‌దీశారు. కేసీఆర్ కోట‌రీలో ఉద్య‌మ ద్రోహులు ఎక్కువ‌య్యార‌న్నారు.

వారంతా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఉంటే తాను మాత్రం బ‌య‌ట ఉన్నాన‌న్నారు. ఆదివారం అమెరికా నుంచి వ‌చ్చిన మిత్రుడ్ని క‌లిసేందుకు హోట‌ల్ కు వెళ్లాన‌ని.. అక్క‌డ కాంగ్రెస్ నేత‌లు రేవంత్‌.. పొన్నం ప్ర‌భాక‌ర్‌.. మ‌ధుయాష్కీ క‌లిస్తే స‌ర‌దాగా కాసేపు మాట్లాడాన‌ని.. ఖుంటియాను మాత్రం క‌ల‌వ‌లేద‌న్నారు. అంత‌లోనే తాను కాంగ్రెస్ లో చేరుతున్న‌ట్లుగా ప్ర‌చారం చేసి పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌టం ఏమిట‌ని త‌ప్పు ప‌ట్టారు.

తాను ఏదైనా పార్టీలో చేరితే నిర్బ‌యంగా అంద‌రికి చెప్పే చేరుతాన‌ని.. కానీ.. త‌న‌కు పార్టీ మారే ఆలోచ‌న లేకున్నా త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీడియా ఎదుట త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని చెప్పుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకున్న రాములునాయ‌క్ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే తిరుగుబాటు స్వ‌రం వినిపించిన కొంద‌రు టీఆర్ఎస్ నేత‌ల‌పై వేయ‌ని స‌స్పెన్ష‌న్ వేటు.. రాములునాయిక్ మీద వేయ‌టం ఏమిటి కేసీఆర్‌? రాములు నాయిక్ త‌ర‌హా నేత క‌న్నీళ్లు గులాబీ కారును కాల్చేస్తేయేమోన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయినా.. ఎన్నిక‌ల వేళ ఈ అన‌వ‌స‌ర‌మైన దూకుడేంది?