Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా గులాబీ ఎమ్మెల్సీ ఇంట పెళ్లి

By:  Tupaki Desk   |   28 March 2017 4:41 AM GMT
హాట్ టాపిక్ గా గులాబీ ఎమ్మెల్సీ ఇంట పెళ్లి
X
ధూంధాంగా శుభకార్యాలు చేయటం కొత్తేం కాదు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి పారిశ్రామిక కమ్ రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగే పెళ్లి ముచ్చట దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారటమే కాదు.. నోరెళ్లబెట్టేలా గ్రాండ్ గా చేసేయటం తెలిసిందే. గాలి వారింట పెళ్లి అంటే.. ఆ లెక్క వేరనుకోవాలి. మైనింగ్ కింగ్ గా అతగాడికున్న కీర్తిప్రతిష్టలు అందరికి తెలిసిందే. మరి అంత పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి..గ్రాండ్ గా పెళ్లి జరపటంలో వింతేమి ఉండకపోవచ్చు.

కానీ.. పెద్దగా జనం నోట్లో నానని టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఇంట జరుగుతున్న పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పెళ్లి ముచ్చట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తారన్నది పక్కనపెడితే.. పెండ్లి పిలుపును డిఫరెంట్ గా ప్లాన్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు ఏమిటి? ఈ పెళ్లి ముచ్చట గురించి ఎందుకంతగా అందరూ మాట్లాడుకుంటున్నారన్న విషయానికి వెళితే.. అందుకు కారణాలు లేకపోలేదు.

తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు.. నిత్యం ఆయన వెంట ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తుల్లో.. రాములు నాయక్ ఒకరు. అతగాడి స్వామిభక్తికి మెచ్చిన కేసీఆర్ ఆయన్ను ఎమ్మెల్సీగా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మూడో కుమారుడు జితేంద్రనాయక్ పెళ్లి త్వరలో జరగనుంది. ఈ పెళ్లిని కాస్త డిఫరెంట్ గా చేయాలని భావించిన రాములు.. ఇన్విటేషన్ లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పెండ్లికి ఆహ్వానించే వారికి దుస్తులు.. వెండి కడియం కలిపి ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఇందుకుగాను.. ముందే కొలతలు తీసుకొని.. ప్రత్యేకమైన డ్రెస్ ను కుట్టించటం విశేషం. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలందరికి పింక్ పైజమా..రెడ్ బాటమ్ తో పాటు.. లాల్చీని బహుమతిగా ఇస్తున్నారు. దీనికికొద్ది రోజుల ముందే.. అందరిదుస్తుల కొలతలు తీసుకొని.. ప్రత్యేకంగా కుట్టించిన వైనం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గులాబీ నేతలంతా గులాబీ డ్రెస్సులు వేసుకొని..పెళ్లి వేడుకల్లో తిరుగుతుంటే కాస్తంత భిన్నంగా ఉండటం ఖాయం. ఇన్విటేషన్లోనే ఇంత వైవిద్యాన్ని ప్రదర్శించిన రాములునాయక్.. పెళ్లికి మరెన్ని కొత్త అంశాల్ని తెరమీదకు తీసుకొస్తారో చూడాలి.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/